
బాణసంచా తయారీ దుకాణాలపై నిఘా
నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్
అనుమతులు లేని దుకాణాలను సీజ్ చేయాలి
కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బాపట్ల టౌన్: బాణసంచా తయారీ దుకాణాలపై నిత్యం నిఘా ఉండాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీగా బి. ఉమామహేశ్వర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నిర్వహించిన సమావేశం కావడంతో జిల్లాలోని అన్ని అంశాలపై ఆయా అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. తొలుత ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు, పరిష్కరించేందుకు తీసుకున్న చర్యలు, విచారణ దశలో ఉన్న కేసుల పురోగతి, మహిళల మిస్సింగ్, గంజాయి, ఎస్సీ ఎస్టీ సంబంధిత కేసుల దర్యాప్తు, సైబర్ నేరాలు, శక్తి యాప్, మహిళ సంబంధిత చట్టాలపై సర్కిల్ వారీగా రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాణసంచా తయారీ, నిలువ చేసే కేంద్రాలు, విక్రయ దుకాణాలకు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతులు ఉండాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ అధికారులు వాటిని తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని ఆదేశించారు. జాగ్రత్తలు తీసుకోని వారిపై, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇళ్లలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన మందుగుండు సామగ్రిని సీజ్ చేయాలని తెలిపారు.
పాత నేరస్తులపై నిఘా ఉంచాలి
గతంలో నేరాలకు పాల్పడిన వారిపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఎస్పీ సూచించారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు, చెడు నడత కలిగిన వ్యక్తుల వివరాలు సంబంధిత స్టేషన్ ఎస్‌హెచ్‌ఓకు పూర్తిగా తెలిసి ఉండాలని చెప్పారు. నేరస్తుల పూర్తి సమాచారం ఉన్నప్పుడే నేరాలను సమర్థంగా కట్టడి చేయగలమని తెలిపారు. సోషల్ మీడియాపై నిఘా ఉంచాలన్నారు. ప్రజలు, రాజకీయ పార్టీలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టిన వారిపై, ఇతరుల మనోభావాలకు భంగం కలిగే విధంగా వార్తలు వ్యాపింప చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహాలు, వ్యాపార సముదాయాలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా యజమానులను ప్రోత్సహించాలని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశాలు, బహిరంగ ప్రదేశాల్లో, నిరుపయోగంగా ఉన్న భవనాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగడానికి అవకాశం ఉన్న ప్రదేశాలలో డ్రోన్‌లను ఎగురవేసి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దొంగతనాలు అరికట్టేందుకు నైట్ బీట్, పెట్రోలింగ్ పటిష్టంగా నిర్వహించాలని, స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కూడా తప్పనిసరిగా రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. సమావేశంలో రేపల్లె, బాపట్ల, చీరాల డీఎస్పీలు ఏ.శ్రీనివాసరావు, జి.రామాంజనేయులు, ఎండీ మోయిన్, సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, డీసీఆర్బీ డీఎస్పీ బాలమురళీకృష్ణ పాల్గొన్నారు.