
పట్టు కోల్పోతున్న చేనేత
మరమగ్గాలపై ఇబ్బడిముబ్బడిగా పట్టు చీరల తయారీ
తక్కువ ధరకే మార్కెట్లో భారీగా విక్రయాలు
మగ్గంలో తయారు చేసిన పట్టు చీరలకు తగ్గిన గిరాకీ
వృత్తి వదిలి కూలీ పనులకు చేనేత కార్మికులు
వేటపాలెం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేత కేంద్రాలైన చీరాల, జాండ్రపేట, వేటపాలెం, రేపల్మె, భట్టిప్రోలు, కనిగిరి, బేస్తవారిపేట, ఈతముక్కల, వలపర్ల తదితర ప్రాంతాల్లో 10 వేల వరకు చేనేత మగ్గాలు ఉన్నాయి. ఈ రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 2 లక్షల మందికిపైగా కార్మికులు జీవనం సాగిస్తున్నారు. మొన్నటి వరకు ఒక వెలుగు వెలిగిన చేనేత మగ్గాలకు పవర్‌లూమ్స్ శాపంగా మారాయి. చేనేత కార్మికుడు మగ్గంపై 5 లేదా 7 రోజులపాటు ఒక చీర బారు నేస్తే పవర్‌లూమ్స్‌లో రోజుకు రెండు చీరల బార్ తయారవుతున్నాయి. చేనేత మగ్గంలో తయారైన చీర కన్నా మరమగ్గంపై తయారైన పట్టు చీరను 30 నుంచి 40 శాతం తక్కువ ధరకు విక్రయిస్తుండటంతో చేనేత మగ్గాల వైపు వ్యాపారులు కన్నెత్తి కూడా చూడటం లేదని కార్మికులు వాపోతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి..
కర్ణాటక, బెంగళూరు, చైన్నెతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పవర్‌లూమ్స్‌లో తయారు చేసిన పట్టు చీరలను తక్కువ ధరలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. పవర్‌లూమ్స్‌లో చేనేత రిజర్వేషన్ చట్టం ప్రకారం వందశాతం పట్టు దారంతో, డిజైన్‌లను తయారు చేయకూడదు. పవర్ లూమ్స్‌లో తయారయ్యే పట్టు చీరలలో 52 శాతానికి మించి జరీ వాడకూడదు. బార్డర్, పల్లూ డిజైన్‌లు చేనేత మగ్గంలో తయారయ్యే వాటిని వాడకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 11 రకాల డిజైన్‌లను మరమగ్గాలలో తయారు చేయకూడదన్న నిబంధనలతో ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. ఈ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా పట్టు చీరలు తయారు చేసి చేనేతలను దెబ్బతీస్తున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాల్సిన హాండ్లూమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల పర్యవేక్షణ కరువైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్ చట్టానికి తూట్లు పొడుస్తూ మరమగ్గాలలో పట్టుచీరల తయారీకి అడ్డు చెప్పకుండా ఉండాలంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాస్టర్ వీవర్ ప్రతి నెలా మామూలు ఇవ్వాలని షరతుల పెట్టి వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అరకొరగా ఉన్న మరమగ్గాలు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి.
మూత పడుతున్న చేనేత మగ్గాలు..
మరమగ్గాల దెబ్బకు చేనేత మగ్గాలు నష్టాలను చవిచూస్తుండటంతో క్రమంగా మూతపడునత్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.24 వేలు సాయం అందించేది. కూటమి ప్రభుత్వం నేతన్న నేస్తం పథకానికి తొలి ఏడాది మంగళం పాడింది. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకొని నేతన్నలు జీవనం సాగిస్తున్నారు. తీసుకొన్న వడ్డీ డబ్బులు చెల్లించడానికి, కుటుంబ జీవనం గడవడానికి నేత కార్మికులు వారి వృత్తిని వదిలి బేల్దారీ, రంగులు, ఇతర వ్యవసాయ పనులు, జీడిపరిశ్రమలో పనులకు వెళుతున్నారు.

పట్టు కోల్పోతున్న చేనేత