
దర్జాగా ప్రైవేట్ దందా !
ఆర్టీసీ బస్టాండ్ ఎదురు అడ్డదిడ్డంగా బస్సులు నిలుపుదల ట్రాఫిక్‌కు తీవ్ర అంతాయం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనచోదకులు
చర్యలు తీసుకుంటాం
పట్నంబజారు: ఆర్టీసీ బస్టాండ్ వెలుపల రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. నడి రోడ్డుపైనే బస్సుల్ని నిలిపి, ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆర్టీఏ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా 100పైగా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్, బెంగుళూరు, వైజాగ్, చైన్నె, తిరుపతితో అనేక దూర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. ఈ సమయంలో నిబంధనలు పాటించాల్సిన బస్సు యజమానులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ పరిధిలో రెండు కిలోమీటర్ల లోపు ఎటువంటి బస్సులు నిలపకూడదని మోటార్ వెహికల్ యాక్ట్ స్పష్టంగా చెబుతోంది. అయితే, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉంది. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత, ఫోర్స్‌ను రంగంలోకి దించి చర్యలు తీసుకోవాల్సిన కనీస విషయాన్ని వారు మరిచిపోయారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఒక రోజు విధుల్లో ఉంటే.. నాలుగు రోజులు సెలవులో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం పట్టించుకుంటారని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది బాహటంగానే విమర్శిస్తున్నారు. పలుమార్లు విన్నవించినప్పటికీ కనీసం మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్ (ఎంవీఐ), సిబ్బందిని కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బస్టాండ్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నిలుపుదలపై ప్రత్యేక దృషి సారించి చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపడతాం. సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సులు నిలువకుండా యాక్షన్ తీసుకుంటాం.
–ఎ. అశోక్, సీఐ, ఈస్ట్ ట్రాఫిక్