మరణాలపై వీడని మిస్టరీ | - | Sakshi
Sakshi News home page

మరణాలపై వీడని మిస్టరీ

Sep 6 2025 5:41 AM | Updated on Sep 6 2025 5:41 AM

మరణాలపై వీడని మిస్టరీ

మరణాలపై వీడని మిస్టరీ

● భయం గుప్పెట్లో తురకపాలెం గ్రామస్తులు ● వ్యాధి నిర్ధారణ చేయలేకపోయిన అధికారులు, ప్రజాప్రతినిధులు ● జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి గ్రామాన్ని శుక్రవారం సందర్శించి మీడియాతో మాట్లాడారు. గ్రామంలో 59 మంది రక్తనమూనాలు సేకరించి, పరీక్షలు చేశామని తెలిపారు. ఫలితాలు అనుమానించదగినవిగా లేవని, నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు. ● కేంద్ర మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మాట్లాడుతూ బర్కోల్డేరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని, మెలియాయిడోసిస్‌ అనేది చాలా అరుదైన వ్యాధి అన్నారు. గ్రామంలో ఎవరికీ సరైన అవగాహన లేకపోవడంతో తెలుసుకునేందుకు సమయం పడుతుందన్నారు. ● రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ గ్రామస్తులకు రక్త పరీక్షలు చేస్తున్నారని, మెలిడాయిసిస్‌ బ్యాక్టీరియా ఉన్నట్లు పరీక్ష ఫలితాలు రాలేదన్నారు. ఎలాంటి బ్యాక్టరీయా అనేది ఇంత వరకు అంతుచిక్కలేదని ప్రకటించారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు / గుంటూరు మెడికల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న గుంటూరు రూరల్‌ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొద్దిరోజులుగా మీడియాలో వార్తా కథనాలు రావడంతో నిద్రలేచిన అధికార యంత్రాంగం గ్రామానికి కదిలింది. రాష్ట్ర ప్రజ్రాప్రతినిధులు సైతం గ్రామ బాట పట్టారు. మూడు రోజులుగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి వైద్య పరీక్షలు చేస్తున్నా.. ప్రజలకు ఆవగింజంత ఆత్మవిశ్వాసాన్ని కల్పించలేకపోతున్నారు. మేమున్నామంటూ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినప్పటికీ ప్రజల్లో ఉన్న భయాందోళనలు రవ్వంత కూడా తొలగిపోలేదు. మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి?ఎక్కడ లోపం జరిగింది ?అనే విషయాలు ఎవరూ తేల్చలేదు. కొన్ని నెలలుగా గ్రామ ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా, అధికార యంత్రాంగం నిద్రమత్తులో తూలుతుండటంతో గ్రామం వల్లకాడును తలపిస్తోంది.

భిన్న ప్రకటనలతో గందరగోళం

మరణాలకు ఎప్పుడు ఫుల్‌స్టాప్‌ ?

రెండు నెలలుగా గ్రామంలో మరణ మృదంగం మోగుతోంది. రెండు నెలల అనంతరం కళ్లు తెరిచిన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు మూడు రోజులుగా హడావుడి చేస్తున్నారు. గ్రామ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని, భరోసాను కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వ్యాధికి గల కారణాలు, అందుకు అందుబాటులో ఉన్న చికిత్సలు, సదరు చికిత్సలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి. వ్యాధి నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తేటతెల్లంగా కనిపించే వరకు తురకపాలెం గ్రామస్తులు నిద్రపోయే పరిస్థితి లేదు. ఒకేరోజు గ్రామంలో ముగ్గురు మూడు రకాల స్టేట్‌మెంట్‌లతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి అనేది తెలియక మరింత భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement