
సింగిల్ నంబర్ లాటరీ విక్రేతలు అరెస్ట్
నరసరావుపేట టౌన్: నిషేధిత సింగిల్ నంబర్ లాటరీ విక్రేతలు నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.51,480లు స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట ఇన్‌చార్జి డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. బుధవారం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. చిత్రాలయ టాకీస్ సెంటర్‌లో సింగిల్ నంబర్ లాటరీ టిక్కెట్లు విక్రయిస్తున్నారన్నా సమాచారం మేరకు టూటౌన్ పోలీసులు దాడులు నిర్వహించి ఇస్లాంపేటకు చెందిన షేక్ మస్తాన్‌వలి, ఉప్పలపాడు గ్రామానికి చెందిన పరిమి వెంకటేశ్వర్లులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.6,580 నగదు, లాటరీ నంబర్లకు సంబందించి స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారన్నారు. అదే విధంగా ఏంజెల్ టాకీస్ సమీపంలో వన్‌టౌన్ పోలీసులు దాడులు నిర్వహించి నిమ్మతోటకు చెందిన గుడిపాటి వెంకటేశ్వరరావు, ఇస్లాంపేటకు చెందిన షేక్ నన్నూ బాజీలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.44,900 నగదు, లాటరీ నంబర్ల స్లిప్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు ఇస్లాంపేటకు చెందిన షేక్ ఖాజాషరీఫ్ అలియాస్ బుజ్జి, రామిరెడ్డిపేటకు చెందిన షేక్ గౌస్‌పీరాలను అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. నిందితులను అరెస్ట్ చేయటంలో ప్రతిభ కనపరిచిన వన్‌టౌన్, టూటౌన్ సీఐలు ఎం.వి.చరణ్, ఎం.హైమారావు, ఎస్‌ఐలు టి.అశోక్ బాబు, అరుణలను అభినందించారు. నిషేదిత లాటరీ, మట్కా నిర్వాహకులపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
నలుగురు అరెస్ట్,
మరో ఇద్దరి కోసం గాలింపు
వెల్లడించిన డీఎస్పీ నాగేశ్వరరావు