
పోలీస్‌గా ఉద్యోగంలో చేరడం అదృష్టం
జిల్లా ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: పోలీస్‌శాఖలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ సేవలు అందించడం హర్షనీయమని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ అన్నారు. జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన పీజీఆర్‌ఎస్ సెల్ ఎస్‌ఐ డి.వి. డేవిడ్, స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ ఎన్.రామకోటేశ్వరరావులను ఆదివారం సన్మానించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీసు ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకున్నదన్నారు. ప్రజలకు నేరుగా సేవలు అందించడం పోలీసు ఉద్యోగంలోనే జరుగుతుందన్నారు. అలాంటి ఉద్యోగంలో మనం చేరడం చాలా గొప్ప అదృష్టంగా భావించాలన్నారు. పోలీస్ శాఖకు సుదీర్ఘకాలంపాటు విశేషసేవలు అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడపాలని, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఎటు వంటి సమస్య వచ్చిన నేరుగా తమను కలవవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు ఏఆర్ డీఎస్పీ పి.విజయసారథి, వెల్ఫేర్ ఆర్‌ఐ మౌలిద్దీన్, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.