
పారదర్శకత కోల్పోతున్న ఎన్నికల కమిషన్
గుంటూరు ఎడ్యుకేషన్: భారత ఎన్నికల సంఘం గత దశాబ్ద కాలంగా స్వయం ప్రతిపత్తిని కోల్పోవడంతో పాటు పారదర్శకంగా, జవాబు దారీతనంతో వ్యవహరించడం లేదని సిద్ధార్థ లా కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్. దివాకర్ బాబు పేర్కొన్నారు. బ్రాడీపేటలోని బాలానంద కేంద్రంలో ఆదివారం రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ అధ్యక్షతన ‘‘రాజ్యాంగం – భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య వక్త దివాకర్‌బాబు మాట్లాడుతూ రాజ్యాంగంపై నమ్మ కం, విశ్వాసం లేని వాళ్లు పాలకులుగా కొనసాగు తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. భారత ఎన్నికల కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ త్రిసభ్య కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించి, ఆ స్థానంలో కేంద్ర మంత్రిని పెట్టడం సబబు కాదని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రను కోల్పోయే విధంగా కేంద్ర ప్రభు త్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బిహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హడావుడిగా ప్రత్యేక సమగ్ర సవరణ ద్వారా 65 లక్షల ఓట్లను తొలగించడం, ఆధార్ కార్డును పరిగణన లోకి తీసుకోకుండా జనన ధ్రువీకరణ పత్రాలను కోరడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అత్యధికులు బిహార్ నుంచి వలస కార్మికులుగా పలు రాష్ట్రాలకు పోతున్న స్థితిని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోక పోవడం విచారకరమని తెలిపారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌కు దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సొంత సిబ్బంది ఉండాలని అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా సక్రమంగా ఉంటే ప్రజా స్వామ్యం వికసిస్తుందని, దాని రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షుడు నడింపల్లి గురుదత్ మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా దాన్ని కాపాడుకోవాలని కోరారు. రాజ్యాంగ చర్చా వేదిక కార్యదర్శి అవధానుల హరి మాట్లాడుతూ కాగ్, యూపీఎస్సీ, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ సంస్థల్లో అధికార పార్టీల జోక్యం ఉండరాదని తెలిపారు. రాజ్యాంగ చర్చా వేదిక సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి. సేవా కుమార్, ప్రోగ్రెసివ్ ఫోరమ్ అధ్యక్షు డు పి. మల్లికార్జునరావు, అవగాహన కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సీపీఎం నేత నళినీ కాంత్, సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి ప్రసంగించారు.