
104 వాహన సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి
లక్ష్మీపురం: 104 మొబైల్ మెడికల్ యూనిట్ ఉద్యోగుల (ఎంఎంయూ) సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళన చేపడుతామని జిల్లా గౌరవాధ్యక్షులు బి. లక్ష్మణరావు తెలిపారు. స్థానిక పాత గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం కె. సత్యరాజు అధ్యక్షతన జరిగిన యూనియన్ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తగ్గించిన వేతనాల సహా ఉద్యోగులకు చెల్లించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత యాజమాన్యం అరబిందో నుంచి రావాల్సిన అన్ని బకాయిలను చెల్లించే విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలయ్యే లీవులు, పబ్లిక్ హాలిడేలు, గుర్తింపు కార్డులు, పే స్లిప్పులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వాహనాలకు సరిపడా సిబ్బందిని నియమించాలని, అవసరమైన చోట బఫర్ జోన్ ఉద్యోగులను నియమించాలని కోరారు. వాహనాలకు ఏళ్ల తరబడి మరమ్మతులు చేయక పోవడంతో సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని, వెంటనే చేయించాలని ఆయన కోరారు. రూ. 10 లక్షల బీమా సౌకర్యాన్ని ప్రతి ఉద్యోగికి కల్పించాలని విన్నవించారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐ పూర్తిస్థాయిలో అమలు చేయాలని, ఈఎస్‌ఐ పరిధి దాటిన వారికి హెల్త్ కార్డులు ఇవ్వాలని లక్ష్మణరావు కోరారు. డిమాండ్ల సాధనకు నిర్వహించనున్న ఆందోళనలో ఉద్యోగులంతా పాల్గొనాలని ఆయన కోరారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
నూతన అధ్యక్ష, కార్యదర్శిగా గోరంట్ల సురేష్, ఆలూరి శ్రీహర్ష, కోశాధికారిగా ఐ. నాగులు, ఉపాధ్యక్షులుగా కె. సత్తిరాజు, సహాయ కార్యదర్శిగా బి. బాలకృష్ణ, కమిటీ సభ్యులుగా విజయ్ కుమార్, ఏడుకొండలు, సురేష్, సాయిరాం, విజయ్ నియమితులయ్యారు.
జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.లక్ష్మణరావు