
బీసీలపై వివక్ష చూపుతున్న కూటమి ప్రభుత్వం
నెహ్రూనగర్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలపై వివక్ష చూపుతుందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమ్మర క్రాంతికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం చుట్టుగుంటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో బీసీలంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారన్నారు. బీసీలకు ఇస్తామన్నా హామీలను నెరవేర్చడానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తూ వారిని మభ్య పెట్టాలని చూస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో బీసీలపై అనేక దాడులు జరిగాయన్నారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర పాలనలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఒక్క రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోలేదని విమర్మించారు. ఎన్నికల సమయంలో చెప్పిన బీసీల రక్షణ చట్టం తెస్తామన్నారు..దానిని గాల్లో పెట్టారన్నారు. కులగణన చేస్తామన్నారు..దానికి అతిగతి లేదన్నారు. తక్షణమే కుల గణన చేపట్టి, బీసీల రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి, రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి కొల్లూరి హనుమంతరావు, గుంటూరు యువజన అధ్యక్షులు తురక రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కోలా మణికంఠ పాల్గొన్నారు.
బీసీలపై వివక్ష చూపుతున్న కూటమి ప్రభుత్వం