
స్వామిత్వ సర్వే పకడ్బందీగా చేయాలి
బల్లికురవ: గ్రామాల వారీగా జరుగుతున్న స్వామిత్వ సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకరరావు అన్నారు. బల్లికురవ మండలంలో జరుగుతున్న సర్వేపై శనివారం స్థానిక పరిషత్ కార్యాలయంలో వెక్టరైజేషన్‌లో భాగంగా పంచాయతీ సెక్రటరీలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లకు పలు సూచనలు చేశారు. గ్రామాల్లోని ప్రజలకు సంబంధించిన ఆస్తులను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. సర్వేలో మోసాలు తలెత్తకూడదని.. 2 నెలల ముందు సర్వే పూర్తిచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున సీజనల్ జ్వరాలు వ్యాధులు సోకకుండా నవంబర్ వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టాలన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్య వంతమైన సమాజం సాధ్యమన్నారు. ఎంపీడీవో కుసుమకుమారి, కార్యాలయ ఏవో పాండురంగస్వామి పాల్గొన్నారు.