
ముగిసిన జాతీయస్థాయి యోగా పోటీలు
ఓవరాల్ ఛాంపియన్ విన్నర్లుగా భోపాల్ రీజియన్
రన్నర్లుగా హైదరాబాద్ రీజియన్ విజయకేతనం
విజేతలకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలకు అర్హత
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే ప్రతి అంశాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పట్టుదలతో కృషి చేయాలని మద్దిరాల జేఎన్‌వీ పూర్వ విద్యార్థి, తమిళనాడు రాష్ట్ర లేబర్ వెల్ఫేర్, స్కిల్స్ డెవలప్‌మెంట్ కార్యదర్శి కె.వీరరాఘవరావు పేర్కొన్నారు. నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి యోగా క్రీడా ప్రదర్శన పోటీల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని పీఎంశ్రీ జేఎన్‌వీలో హైదరాబాద్ జేఎన్‌వీ రీజియన్ పరిధిలో మూడు రోజులు యోగా ప్రదర్శన పోటీలు జరిగాయి. గ్రూప్ ఆసనాలు, రిథమిక్, ఆర్టిస్టిక్ యోగా విభాగాల్లో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోటీలు శనివారంతో ముగిశాయి. విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు అధ్యక్షత వహించగా, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పరిచయ, మూడు రోజుల యోగా పోటీల నిర్వహణ సారాన్ని వివరించారు. మరో అతిథి హైదరాబాద్ రీజియన్ అసిస్టెంట్ కమిషనర్ డి.చక్రపాణి మాట్లాడుతూ జేఎన్‌వీల్లో చదివిన ఎందరో ఉన్నతస్థానాల్లో ఉంటూ అందరికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారని చెప్పారు.
విజేతలు వీరే..
ఓవరాల్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను నవోదయ భోపాల్ రీజియన్ సాధించగా, ఛాంపియన్‌షిప్ రన్నర్స్‌గా హైదరాబాద్ రీజియన్ నిలిచింది. యోగాసనాల్లోని అన్ని రీజియన్లలో బాలికల విభాగంలో బెస్ట్‌యోగిని అవార్డును సుస్మితాదాస్ (భోపాల్), బాలుర విభాగంలో బెస్ట్‌యోగి అవార్డును సోహమ్ సుమన్(జైపూర్)కు దక్కాయి.