
అవసరం మేరకే యూరియా తీసుకోవాలి
కర్లపాలెం: ఈ ఖరీఫ్ సీజన్‌కు వరి సాగు చేసిన రైతులు అవసరం మేరకే యూరియా తీసుకోవాలని కర్లపాలెం మండల వ్యవసాయాధికారి సుమంత్‌కుమార్ సూచించారు. మండల పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శనివారం రైతుసేవా కేంద్రం ద్వారా 20 టన్నుల యూరియా పోలీసు బందోబస్తు మధ్య రైతులకు పంపిణీ చేశారు. ఏవో మాట్లాడుతూ కర్లపాలెం మండలంలో మొత్తం 15వేల ఎకరాలకుగాను సుమారు 12వేల ఎకరాలకు పైగా వరినాట్లు వేశారని తెలిపారు. మొత్తం విస్తీర్ణానికి 980 మెట్రిక్ టన్నుల యూరియా కావలసి ఉండగా ఇప్పటి వరకు 850 మెట్రిక్ టన్నుల యూరియా మండలంలోని పలు గ్రామాలలో రైతులకు పంపిణీ చేశామని తెలిపారు. యాజలి రైతు ఉత్పత్తిదారుల సేవా సంస్థ ద్వారా 20 టన్నులు, తుమ్మలపల్లి రైతు సేవా కేంద్రం ద్వారా 20 టన్నుల యూరియా రైతులకు పంపిణీ చేశామన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాలకు విడతల వారీగా యూరియా వస్తుందని రైతులు ఆందోళన పడవద్దని ఏవో తెలిపారు. కొన్నిచోట్ల యూరియా దొరకదనే భయంతో కొంతమంది రైతులు అవసరానికి మించి యూరియా తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇలా చేయటం వలన అవసరం ఉన్న రైతులకు అందకపోవచ్చునని రైతులు అవసరం మేరకే తీసుకోవాలని ఏవో రైతులను కోరారు.