
రసవత్తరంగా జాతీయ యోగా పోటీలు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్) ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ మండలం మద్దిరాల పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం వేదికగా జరుగుతున్న జాతీయస్థాయి యోగా విన్యాసాల ప్రదర్శన పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. భోపాల్, చండీఘర్, జైపూర్, హైదరాబాద్, లక్నో, పూనే, పాట్నా, షిల్లాంగ్ జేఎన్‌వీ రీజియన్ల పరిధిలోని ఒక్కొక్క రీజియన్ నుంచి బాలురు, బాలికలు 42 మంది చొప్పున 336 యోగాసాధకులు, టీంలీడర్, సంరక్షకులు హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ నవోదయ విద్యాలయ సమితి అసిస్టెంట్ కమిషనర్ డి చక్రపాణి రెండోరోజు పోటీల నిర్వహణను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
వివిధ విభాగాల్లో ఉత్సాహంగా పోటీలు
అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల్లో బాలురు, బాలికలకు వేర్వేరుగా జాతీయస్థాయి యోగా పోటీలు నిర్వహిస్తున్నారు. వీటిలో యోగ ఆసనాలు, ఆర్టిస్టిక్ యోగా, రిథమిక్ యోగా వంటి కేటగిరీలతో పాటు, ఉత్తమ యోగి (బెస్ట్ యోగి), ఉత్తమ యోగిని (బెస్ట్ యోగినీ) వంటి ప్రత్యేక విభాగాల్లోనూ తీవ్రపోటీ నెలకొంది. తొలిరోజున బాలబాలికలు వివిధ ఆయా విభాగాల్లో అబ్బురపరిచే యోగా ప్రదర్శనలతో మెప్పించారు. రెండోరోజైన శుక్రవారం ఆర్టిస్టిక్ విభాగంలో అండర్–14, అండర్–17, అండర్–19 విభాగాల పోటీలు ఉత్సాహంగా కొనసాగాయి. పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ, వివిధ అసోసియేట్స్‌కు చెందిన యోగా అఫీషియల్స్ 15 మంది వ్యవహరిస్తున్నారు. పోటీలను మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ విద్యాలయ ప్రిన్సిపల్ నల్లూరి నరసింహరావు పర్యవేక్షణలో వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పీఈటీలు ఆర్ పాండురంగారావు, జి గోవిందమ్మ, అధ్యాపకులు సహకారం అందించారు. జాతీయస్థాయి యోగా పోటీల ముగింపు సభ శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నారు.