
కారు ఢీకొని సైకిలిస్ట్ మృతి
భట్టిప్రోలు: అతి వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టడంతో సైకిలిస్ట్ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం భట్టిప్రోలు వద్ద జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భట్టిప్రోలు పంచాయతీ పరిధిలోని అద్దేపల్లికి చెందిన రంగిశెట్టి జయచంద్రరావు (55) వేమవరం సమీపంలోని ఎన్‌హెచ్ 216/ఎ జాతీయ రహదారి వెంబడి ఉన్న పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలంలో శుక్రవారం నాట్లు వేస్తున్నారు. కూలీలకు తాగు నీరు తీసుకువచ్చేందుకు ఉదయం 10 గంటల సమయంలో సైకిల్‌పై బయలుదేరాడు. వెనుక నుంచి కారు అతి వేగంగా వచ్చిన కారు సైకిల్‌పై వెళుతున్న జయచంద్రరావును ఢీ కొట్టింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, చుట్టుపక్కల వారు జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ ఎం. శివయ్య ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. గుంటూరుకు చెందిన కారు డ్రైవర్ నక్కా సురేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడికి భార్య, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలు వివాహాలు అయ్యాయి. భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.