
పుష్కర ఘాట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం
కాపాడిన మత్స్యకారులు
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజ్ కృష్ణానది దిగువ ప్రాంతంలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ఓ మహిళ కృష్ణానది వరద నీటిలోకి దిగి శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇది గమనించిన మత్స్యకారులు ఆమెను కాపాడి తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ భవానీపురంనకు చెందిన నరేంద్రతో ఏడాదిన్నర క్రితం యామినికి వివాహమైంది. గత ఆరు నెలలుగా వారి మధ్య మనస్పర్థలు రావడంతో యామిని భవానీపురంలోని తల్లిదండ్రులు వద్ద ఉంటోంది. భర్త దగ్గరకు వెళ్లగా ఇంట్లో నుంచి బయటకు నెట్టడంతో మనస్తాపం చెంది సీతానగరం పుష్కర ఘాట్ల వద్దకు వచ్చింది. చనిపోవడానికి వరదనీటిలోకి దూకింది. పక్కనే పడవలను భద్రపరుస్తున్న మత్స్యకారులు గమనించి నీటిలోకి దిగి ఆమెను కాపాడారు. సమాచారం అందుకున్న తాడేపల్లి మహిళా పీఎస్‌ఐ అపర్ణ సంఘటనా స్థలానికి వెళ్లి యామిని తండ్రి శ్రీనివాసరావును పిలిపించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.