
అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పింఛన్ అందించాలి
బాపట్ల: జిల్లాలో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేయాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి పేర్కొన్నారు. సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలోని 22 ఫీడర్లకు ఏడు సబ్‌స్టేషన్ల పరిధిలో 17 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి 82.5 ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి తీసుకుంటున్నట్లు తెలిపారు. సూర్యలంక బీచ్ దగ్గర ఉన్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కేంద్రానికి నీటి సరఫరాలో ఇబ్బందులు లేవని, 2015 సంవత్సరంలో మంజూరు చేసిన పనులలో 70 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన 30 శాతం త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సదరం ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలనలో భాగంగా అర్హత ఉండి పింఛన్ నిలుపుదల అయిన లబ్ధిదారులు ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారికి పింఛన్ ఇస్తామని తెలిపారు. వారి ధ్రువీకరణ పత్రాలను మరోసారి పునః పరిశీలన చేస్తామని తెలిపారు. అనర్హులుగా తేలితే పింఛన్ నిలుపుదల చేస్తామని తెలిపారు. దరఖాస్తు చేయని వారికి పింఛన్ నిలుపుదల చేస్తామన్నారు.
మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు
మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల మరమ్మతులు, కాలువలలో పూడికతీత పనులను ఎప్పటికప్పుడు చేపట్టా లని కలెక్టర్ అధికారులకు సూచించారు. భూగర్భ జలాలు పెంచేందుకు నీటి సంరక్షణ పనులను విరి విగా చేపట్టాలన్నారు. ఇన్‌చార్జి జేసీ జి.గంగాధర్ గౌడ్, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, ఏపీ సీపీడీసీఎల్ ఎస్‌ఈ ఆంజనేయులు, హౌసింగ్ పీడీ వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్ డీఎం కరుణశ్రీ ఉన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి