
ప్రభుత్వ రాబడికి గండి
గత ప్రభుత్వంలో పర్చూరు నియోజకవర్గంలోని బొబ్బేపల్లి, కోలలపూడి, వలపర్ల, బొల్లాపల్లి ప్రాంతాల్లో పదుల సంఖ్యలో గ్రావెల్ లీజులు ఉండేవి. సదరు లీజుల నుంచి గ్రావెల్ తరలించి అవసరమున్న చోటుకు అమ్మేవారు. దీనివల్ల అటు ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. తద్వారా జిల్లాకు, మైనింగ్ పరిధిలోని గ్రామపంచాయతీలకు నిధులు సమకూరేవి. వాటితో అభివృద్ధి పనులు చేపట్టేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే లీజు క్వారీల్లో మైనింగ్ జరగకుండా నిలిపి వేయించారు. కూటమి సర్కారు కొలువు దీరే వరకూ పచ్చగా ఉన్న కొండలు పచ్చనేతల గ్రావెల్ దందాతో ఇప్పడు తరిగిపోయి బోళ్లుగా మారిపోయాయి. గ్రావెల్ తరలింపుతో కొన్ని ప్రాంతాలు దాదాపు కనుమరుగయ్యాయి. అక్రమ గ్రావెల్ దందాతో ప్రభుత్వ రాబడికి రూ.కోట్లలో గండి పడుతోంది. అయినా సంబంధిత శాఖలు అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కొండలను పిండిచేస్తున్నా స్థానిక రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. నెల మామూళ్లు పుచ్చుకుంటూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.