
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
కలెక్టర్‌ను కోరిన ఏపీ సర్పంచుల సంఘం ముఖ్య సలహాదారు
నరసరావుపేట: జిల్లాలో గ్రామ పంచాయతీలకు తొమ్మిది నెలల నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు, రిజిస్ట్రేషన్ సర్‌ఛార్జి నిధులను విడుదల చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ (న్యూఢిల్లీ) జాతీయ ఉపాధ్యక్షుడు, ఏపీ సర్పంచుల సంక్షేమ సంఘ ముఖ్యసలహాదారు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు విజ్ఞప్తి చేసారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. రిజిస్ట్రేషన్ సర్ చార్జి నిధులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని గ్రామ పంచాయతీలకు బదిలీ అయ్యేవిధంగా కృషిచేయాలని, రిజిస్ట్రేషన్ ఐజీతో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 526 గ్రామ పంచాయతీలలో రిజిస్ట్రేషన్ సర్‌చార్జి, 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తే సర్పంచులు, గ్రామ పంచాయతీలకు ఊరటగా ఉంటుందన్నారు. గ్రామాలలో నీటి సరఫరాకు, బ్లీచింగ్‌కు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు, విద్యుత్ బకాయిలు ఇచ్చేందుకు వెసులుబాటుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం చాలా గ్రామ పంచాయతీల్లో వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా బ్లీచింగ్ కొనేందుకు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు కూడా నిధులు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టి సారించి నిధులు విడుదలకు కృషిచేయాలని కోరారు. ఈ నిధులు విడుదల చేయకపోతే గత నెలలోనే కేంద్రం నుంచి రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రావలసిన రూ.1000కోట్లు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి కలెక్టర్ స్పందించి సమస్యను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.