
కుందేరు ఆక్రమణలను సహించం
చీరాలటౌన్: కుందేరు ఆక్రమణలను తొలగించడంతోపాటు పూర్వపు స్థితి కొనసాగించేలా కృషి చేస్తున్నామని చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య తెలిపారు. మంగళవారం చీరాల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో తూమాటి చంద్రశేఖర నాయుడు ఆధ్వర్యాన కుందేరు పరిరక్షణ, కుందేరు ఆక్రమణలను తెలుసుకునేందుకు డివిజన్ స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో మురుగునీటిని కుందేరు ద్వారా స్ట్రయిట్ కట్ నుంచి సముద్రంలో కలిపేందుకు ముఖ్యమైన కుందేరు ఆక్రమణలకు గురవ్వడం, కుంచించుకుపోవడం దారుణమన్నారు. కుందేరుకు సంబంధించిన విస్తీర్ణం, వైశాల్యం, పొడవు, ఏయే ఊర్ల నుంచి ఎంత విస్తీర్ణం వ్యాప్తి చెందిందో పూర్తి వివరాలను అధికారులకు త్వరగా అందించాలన్నారు. ఆక్రమణలకు గురైన కుందేరును కాపాడుకోవడం కర్తవ్యమని, కుందేరును అభివృద్ధి చేస్తే రానున్న కాలంలో ఎలాంటి భారీ వర్షాలకై నా మురుగునీటి పారుదలకు ఇబ్బందులు ఉండవన్నారు. ఈపురుపాలెం, వేటపాలెం స్ట్రయిట్ కట్‌ల నుంచి కుందేరును మూసివేసి ఆక్రమణలకు పాల్పడ్డారని.. అలాంటి వారిని వదలబోమన్నారు. అనంతరం నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు కె.గోపికృష్ణ, జె.ప్రభాకరరావు, ఎంపీడీవోలు శివన్నారాయణ, రాజేష్, మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, డ్రైనేజీ, ఇరిగేషన్, సర్వే ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.