
పూజలందుకో.. వి(శ్వ)నాయకా
వాడవాడలా మండపాల ఏర్పాటు మండపాల్లో కొలువుదీరిన గణనాథుడు పూజా సామగ్రి కొనుగోలుకు భక్తుల రాక కిక్కిరిసిన మార్కెట్ వీధులు
మట్టి ప్రతిమలకే అధిక ప్రాధాన్యం
బాపట్ల అర్బన్: సకల లోకాలకు ఆది పూజ్యుడైన వినాయకుడు వాడవాడలా ఠీవిగా కొలువుదీరారు. జై వినాయకా.. జైజై విశ్వనాయకా అంటూ గణనాథుడ్ని ఆరాధించేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. స్వామి వారికి ప్రీతిపాత్రమైన పత్రి, ఇతర పూజాసామగ్రి కొనుగోలుతో బాపట్ల పట్టణం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గణనాథుడి పూజకు అవసరమైన పూజా ద్రవ్యాల సేకరణలో భక్తులు నిమగ్నమయ్యారు. వినాయకచవితి సందర్భంగా బాపట్ల జిల్లా కేంద్రంలో పండుగ వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా వాడవాడలా గణనాథుడి మండపాలు ఏర్పాటు చేశారు. ఆ మండపాల్లో ఇప్పటికే వినాయకుడి విగ్రహాలను కొలువుదీర్చారు. భక్తిశ్రద్ధలతో స్వామి వారిని పూజించేందుకు సకల ఏర్పాట్లు చేసుకున్నారు. వినాయక చవితి పండుగ ఆధ్యాత్మికతతోపాటు సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుంది.
వివిధ ఆకృతుల్లో విగ్రహాల ఏర్పాట్లు
బాపట్ల పట్టణంలోని ప్రతి వీధిలో ఒకటి, అంతుకు మించి వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఆయా వీధుల్లోని ప్రజలకు చందాలు వేసుకుని విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆరాధించేందుక సిద్ధమయ్యారు. ప్రజలు వారి వారి స్థోమతను బట్టి విగ్రహాలు కొనుగోలు చేశారు,. వీటిని పందిళ్లలోకి తరలిస్తుండడంతో పట్టణంలో రద్దీ నెలకొంది.
పూజా సామగ్రికి డిమాండ్
వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని రథం బజార్ సెంటర్, మార్కెట్ సెంటర్, చీలు రోడ్డు, బస్టాండ్ ప్రాంతాల్లో గణేశుని పూజా సామగ్రి విక్రయాలు ప్రారంభించారు. పత్రికి అవసరమైన వెలగపండు, అరటి బోదెలు, పండ్లు వంటివి విక్రయిస్తున్నారు. ఈ ఏడాది పూజా సామగ్రి ధరలు అధికంగా ఉన్నాయని భక్తులు చెబుతున్నారు. గతంలోకంటే 50 శాతం ధరలు పెరిగాయని అంటున్నారు. భక్తుల కొనుగోలుతో ఆయా ప్రాంతాలు రద్దీగా మారాయి.
గ్రామాల్లో చవితి సందడి
రేపల్లె: పట్టణాలు, గ్రామాల్లో వినాయక చవితి సందడి నెలకొంది. పలు ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన మండపాలలో గణనాథులు కొలువుదీరుతున్నారు. వినాయక ప్రతిమలు, పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు రావడంతో పట్టణాలలో వీధులన్నీ రద్దీగా మారాయి. పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో వినాయకుని మట్టి ప్రతిమలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రేపల్లె పట్టణంలోని పెదకూరగాయల మార్కెట్, రాజ్యలక్ష్మి థియేటర్ సెంటర్, నెహ్రూ బొమ్మ సెంటర్లలో ఏర్పాటుచేసిన వినాయకుడు, పూజా సామాగ్రి స్టాల్స్ ప్రజలతో కళకళలాడాయి.
బాపట్ల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వినాయక మట్టి ప్రతిమలు విక్రయిస్తున్నారు. ప్రొడిజి విద్యాలయంలో విద్యార్థులతో మట్టివినాయకులను తయారు చేయించి పంపిణి చేశారు. విద్యార్థులు అధిక శాతం మట్టి విగ్రహాల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నారు. మట్టి విగ్రహాల ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు.

పూజలందుకో.. వి(శ్వ)నాయకా

పూజలందుకో.. వి(శ్వ)నాయకా

పూజలందుకో.. వి(శ్వ)నాయకా