
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పొగాకు కొనుగోలు
కర్లపాలెం: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు పొగాకు కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడవద్దని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధికారులతో కలసి మంగళవారం కర్లపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. తొలుత జిల్లా కలెక్టర్ కర్లపాలెంలోని ఎఫ్‌సీఐ గోదాముల్లో ఏర్పాటుచేసిన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులు అమ్మకానికి తీసుకువచ్చిన పొగాకును పరిశీలించారు. పొగాకు రైతులు మాట్లాడుతూ నాణ్యతగా ఉన్న పొగాకుకు కూడా నాసిరకం పొగాకుకు ఇచ్చే ధర నిర్ణయించి కొనుగోలు చేస్తున్నారని, దీని వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ పొగాకు ధరలు నిర్ణయించేందుకు అనుభవం ఉన్న బయ్యర్లను నియమించి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. పొగాకు నాణ్యత, కొనుగోళ్లకు సంబంధించి బయ్యర్లను అవసరం మేరకు శిక్షణకు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. అన్యాయం జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.
ఎరువులు సిద్ధంగా ఉంచాలి.
ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. కర్లపాలెం సెంటర్‌లో ఉన్న మన గ్రోమోర్ కేంద్రాన్ని, యాజలి గ్రామంలోని రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. మన గ్రోమోర్ సెంటర్‌లో రికార్డులు పరిశీలించారు. అనంతరం గోదాములో ఉన్న ఎరువుల నిల్వలను తనిఖీ చేశారు. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించి సేంద్రియ ఎరువుల వినియోగం పెంచాలని కలెక్టర్ రైతులకు సూచించారు.