
నేను రాను బాస్ చుండూరు స్టేషన్‌కు..
వేమూరు: చుండూరు పోలీసు స్టేషన్ పేరు చెబితే జిల్లాలోని ఎస్‌ఐలు భయపడుతున్నారు. అక్కడ విధి నిర్వహణ కత్తిమీద సాములా మారింది. రేషన్ బియ్యం మాఫీయా, గంజాయి ముఠా పోలీసులను శాసిస్తున్నారు. తమకు అనుకూలంగా నడుచుకోవాలని లేకుంటే బదిలీ తప్పదని హెచ్చరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 14 నెలల కాలంలో నలుగురు ఎస్‌ఐలు బదిలీ అయ్యారు. దీంతో ఈ స్టేషన్‌లో పనిచేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు. నాలుగు నెలలుగా ఎస్‌ఐ పోస్టు ఖాళీగా ఉంది. స్టేషన్ పరిధిలో శాంతిభద్రత నిర్వహణ కష్టతరంగా మారింది. వేమూరు నియోజకవర్గం పరిధిలో వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు, చుండూరు పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు పోలీసుస్టేషన్లుకు ఎస్‌ఐ ఉన్నారు. చుండూరు స్టేషన్ ఎస్‌ఐ పోస్టు మాత్రం ఖాళీగా ఉంది.
మాఫియాకు ఎదురు తిరిగితే బదిలీయే..
చుండూరు మండలంలో రేషన్ మాఫియా, గంజాయి అమ్మకాలు, పేకాట జోరుగా సాగుతుంది. చుండూరు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆధ్వర్యంలో రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం జోరుగా సాగిస్తున్నాడు. నియోజకవర్గంలోని వేమూరు, కొల్లూరు, భట్టిప్రోలు, అమర్తలూరు మండలాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసి నడిగడ్డవారిపాలెంలో ఉన్న రైస్ మిల్లుకు తరలిస్తున్నారు. అక్కడ పాలిష్ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గంజాయి వ్యాపారం జోరుగా సాగుతుంది. కూటమి నాయకుల ఆధ్వర్యంలో నిమ్మ తోటల్లో పేకాట జోరుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ ఎస్‌ఐ గంజాయి, పేకాట నిర్వహణపై ఉక్కపాదం మోపారు. దీంతో కూటమి నేతలు ఆగ్రహించారు. ఆ ఎస్‌ఐపై బదిలీ వేటు పడింది. ఆ తర్వాత వచ్చిన ఎస్‌ఐ కూడా పేకాట నిర్వాహకులపై దృష్టి సారించారు. మే నెల 19వ తేదీన నిమ్మ తోటలో పేకాట ఆడుతున్న వ్యక్తులను గుర్తించేందుకు డ్రోన్‌లు ఉపయోగించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కూటమి నేతల ఆగ్రహానికి గురయ్యారు. ఎస్‌ఐని బదిలీ చేయించారు. అప్పటి నుంచి చుండూరు పోలీసుస్టేషన్‌కు రావాలంటే ఎస్‌ఐలు భయపడుతున్నారు. దీంతో ఎస్‌ఐ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగా ఉంది. అక్రమ రేషన్ బియ్యం జోలికి వెళ్ల వద్దని తహసీల్దార్‌కు కూటమి నేతలు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో తహసీల్దార్ అటు కన్నెత్తి చూడడం లేదు. అక్రమ రేషన్ బియ్యం పట్టుకున్న దాఖలాలు లేవు. దీనిపై చుండూరు సీఐ శ్రీనివాసరావును వివరణ కోరగా పలువురు శిక్షణ పొందుతున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ఎస్‌ఐలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అప్పటి వరకు శాంతిభద్రతలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని చెప్పారు.