
ఆటోను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి
నలుగురికి గాయాలు
సంతమాగులూరు (అద్దంకి రూరల్): ముందు వెళ్తున్న ఆటోను వెనకగా కారు ఢీకొనగా.. ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సంతమాగులూరు మండలంలోని పుట్టావారిపాలెం జంక్షన్ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ పట్టాభిరామయ్య తెలిపిన వివరాల మేరకు.. వినుకొండ మండలంలోని పొట్లూరు గ్రామం నుంచి సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం వెళ్తున్న ఆటోలో డ్రైవర్‌తో సహా ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఈక్రమంలో మార్గమధ్యంలోని పుట్టావారిపాలెం జంక్షన్ దాటిన తరువాత పెట్రోలు బంకు ముందు ఉన్న బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి కారు అతి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో డ్రైవర్ పక్కన కూర్చున్న ప్రయాణికుడు సజ్జాపురం గ్రామానికి చెందిన నంబూరి దావీదు (62) ఎగిరి బ్రిడ్జి పక్కన పడి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని స్థానిక వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

ఆటోను ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి