
నవోదయలో జాతీయ యోగా పోటీలు
అంతిమ లక్ష్యం అదే..
●28 నుంచి ప్రారంభం
●నవోదయ విద్యాలయంలో మూడురోజుల ఆతిథ్యం
●దేశవ్యాప్తంగా ఎంపికై న
ప్రతిభావంతుల రాక
●యోగా సాధకులు, అభిమానులకు పండుగే
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: మొట్టమొదటిసారిగా జాతీయస్థాయి యోగా ప్రదర్శన పోటీలు పల్నాడు జిల్లాలో జరగనున్నాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు జవహర్ నవోదయ విద్యాసమితి షెడ్యూల్ ఖరారైంది. జేఎన్‌వీల పరిధిలో జరిగే ఈ పోటీలకు చిలకలూరిపేట రూరల్ మండలం మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ ఇందుకు వేదికగా మారనుంది. ఈనెల 28, 29, 30 తేదీల్లో వరుసగా మూడు రోజులు మద్దిరాల గ్రామంలో సందడి నెలకొననుంది. యోగా సాధకులు, గురువులు, యోగాభిమానులకు పెద్ద పండుగే కానుంది.
భారత్‌లోని అన్ని రాష్ట్రాల నుంచి...
భారతదేశంలోని నవోదయ విద్యాలయ సమితి 8 రీజియన్‌లకు చెందిన జేఎన్‌వీ విద్యార్థులు హాజరుకానున్నారు. భూపాల్, చండీఘర్, జైపూర్, హైదరాబాద్, లక్నో, పూనే, పాట్నా, షిల్లాంగ్ జేఎన్‌వీ రీజియన్ల పరిధిలో గతనెలలో ప్రాంతీయ స్థాయి యోగా ప్రదర్శన పోటీలు నిర్వహించాయి. అత్యుత్తమ ప్రతిభను కనపరిచి విజేతలైన 336 మంది యోగా సాధకులు ఈ నేషనల్ యోగా మీట్‌లో భాగస్వాములు కానున్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఈనెల 26 నుంచి ఒక్క తమిళనాడు రాష్ట్రం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన యోగా జట్లు మద్దిరాల జేఎన్‌వీకు రానున్నాయి.
ఏఏ విభాగాలు..జట్ల వివరాలు..
పోటీలలో అండర్ –14, అండర్ –17, అండర్ –19 విభాగాల్లో వ్యక్తిగత, బృందాలుగా సాధకులు యోగా ప్రదర్శన కళను ప్రదర్శించానున్నారు. శారీరక సామర్థ్యాన్ని, ఏకాగ్రతను చాటే ‘గ్రూప్ ఆసనయోగా’, సంగీతానికి అనుగుణంగా చేసే కళాత్మక ‘రిథమిక్ యోగ’, యోగాసనాలతో కూడిన కళాప్రదర్శన ‘ఆర్టిస్టిక్ యోగా’ పోటీలు ఉంటాయి. యోగా సాధకులైన జేఎన్‌వీల విద్యార్థులు ఈ మూడు రకాల విన్యాసాలను మూడు వేదికపై కళాత్మకంగా ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నారు. దేశంలోని 8 రీజియన్ల నుంచి 8 టీంలుగా వచ్చే 336 మంది యోగాసాధకులు ఆర్టిస్టిక్‌యోగాలో –6, రిథమిక్‌యోగా –6, గ్రూప్ ఆసనయోగా –48 విభాగాల్లో తమ యోగా విన్యాసా పాటవాలను పోటీల్లో ప్రదర్శించనున్నారు. ఈ పోటీల్లో విజేతలైన వారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలకు ఎంపికవుతారు.
నిర్వహణకు సన్నాహాలు
విద్యాలయంలో పోటీల నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. పోటీల నిర్వహణ ప్రక్రియ విజయవంతం చేసేందుకు విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహరావు పర్యవేక్షణలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, పీఈటీలు ఆర్ పాండురంగారావు, జి గోవిందమ్మ, అధ్యాపకులు సమన్వయంతో కృషి చేస్తున్నారు. ఇందుకోసం మూడు ప్రత్యేక వేదికలు సిద్ధమయ్యాయి. విద్యాలయంలోని ఇండోర్ ఆడిటోరియం ఒకటి కాగా, క్రీడామైదానంలో మరో రెండు వేదికలను పోటీల నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. ఆయా వేదికలపై ఒకేసారి యోగా ప్రదర్శన పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, సాయంత్రం 4 నుండి రాత్రి 8.30 గంటలకు నిర్విరామంగా కొనసాగేలా విద్యాలయ పీడీలు షెడ్యూల్‌ను రూపొందించారు. జాతీయస్థాయి పోటీల నిర్వహణ ప్రారంభం, ముగింపు సభల్లో మద్దిరాల జేఎన్‌వీ విద్యార్థులు ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఇందుకు హైదరాబాద్ నుంచి బ్యాండ్ మాస్టర్, చిలకలూరిపేట నుండి డ్యాన్స్ మాస్టర్‌ను అధ్యాపకులు పిలిపించి తమ విద్యార్థులకు తర్ఫీదు ఇప్పిస్తున్నారు.
ప్రధానంగా మానవ వ్యవస్థను అర్థం చేసుకునే విజ్ఞానశాస్త్రం యోగా ప్రక్రియ అని ఈ పోటీల ద్వారా విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే అంతిమ లక్ష్యం. ఇది కేవలం జాతీయస్థాయి యోగా పోటీ మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు తమ కళను ప్రదర్శించడానికి, వివిధ సంస్కృతులను తెలుసుకోవడానికి లభించిన ఒక గొప్ప అవకాశమేనని చెప్పొచ్చు.
–ఎన్ నరసింహారావు, ప్రిన్సిపల్, మద్దిరాల పీఎంశ్రీ జేఎన్‌వీ

నవోదయలో జాతీయ యోగా పోటీలు

నవోదయలో జాతీయ యోగా పోటీలు