సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాజీ కౌన్సిలర్ పులహరి భానోజి ప్రతిభ చూపారు. సత్తెనపల్లి శక్తి యోగ నిర్వాహకుడు రమేష్ ఆధ్వర్యంలో 6వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ యోగ ఆసనం స్పోర్ట్స్ చాంపియన్‌షిప్– 2025 పోటీలు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ పోటీల్లో సీనియర్ విభాగం 45–55 సంవ్సరాల విభాగంలో స్టేట్ లెవెల్ లో లెగ్ బ్యాలెన్స్ లో సత్తెనపల్లికి చెందిన పులహరి భానోజీ ప్రతిభ కనబరిచి తృతీయ స్థానం దక్కించుకొని బహుమతి, మెడల్‌తో పాటు మెరిట్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఫార్వర్డ్‌బెండ్ విభాగంలో సత్తెనపల్లికి చెందిన వల్లూరి శ్రీనివాసరావు, సుపైని విభాగంలో సత్తెనపల్లికి చెందిన పులికొండ శ్రీనివాసరావు చతుర్థ స్థానం దక్కించుకున్నారు. టెస్టింగ్ విభాగంలో ధనేకుల సాంబశివరావు ఐదో స్థానం కై వసం చేసుకున్నారు. 35–45 సంవత్సరాల విభాగంలో ఫార్వర్డ్‌బెండులో ఎం.సునీల్ కుమార్ నాలుగో బహుమతి సాధించారు. ఈ సందర్భంగా విజేతలను పలువురు ప్రముఖులు, యోగ అభ్యాసకులు ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 30వేల మంది ప్లాన్‌లో చేరిక
నరసరావుపేట: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఈ నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభించిన సరికొత్త ఫ్రీడం ప్లాన్ విజయవంతంగా నడుస్తుందని ఆ సంస్థ గుంటూరు బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ సప్పరపు శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఊహించిన దాని కన్నా అద్భుతమైన ప్రతిస్పందన ప్రజల నుంచి వస్తోందన్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముప్పై వేల మందికి పైగా నూతన వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఈ ప్లాను కింద రూ.1తో 30 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత కాలింగ్, రోజుకి రెండు జీబీ డేటా, రోజుకు 100 మెసేజిలు, ఉచిత సిమ్ కార్డు అందిస్తోందన్నారు. ఏంఎన్‌పీ ద్వారా బీఎస్‌ఎన్‌ఎల్‌కు వచ్చే వినియోగదారులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. ప్రస్తుతం గుంటూరు బిజినెస్ ఏరియా పరిధిలో 700పైగా ఫోర్‌జి టవర్లు పనిచేస్తున్నాయని, తద్వారా తమ వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన డేటా, వాయిస్ కాల్స్ సేవలను అందించటానికి కృషిచేస్తున్నామని తెలిపారు. ఈ ఆఫరు అగస్టు 31తేదీతో ముగుస్తుందని, కావున ప్రజలందరూ మిగిలిన రోజులలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, సిమ్ కార్డు కావలసిన వారు దగ్గరలోని బీఎస్‌ఎన్‌ఎల్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలని ఆయన సూచించారు.

రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో భానోజీకి తృతీయ స్థానం