
కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు
కొల్లూరు: కృష్ణా నది వరదల కారణంగా పంటలు మునకకు గురై ఏర్పడిన పంట నష్టానికి తోడు, అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి హరిబాబు డిమాండ్ చేశారు. ఆదివారం కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్రా మాల్యాద్రితో కలసి ఆయన మండలంలోని పోతార్లంకకు చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణా నదికి వచ్చిన వరదల వల్ల కౌలు రైతు ఈడ్పుగంటి మురళీకృష్ణ 5.85 ఎకరాలలో సాగు చేసిన అరటి, పసుపు, కంద పంటలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు. దీనికి తోడు పంటల పెట్టుబడుల కోసం రూ.15 లక్షల పైబడి బ్యాంక్‌లు, స్థానిక వ్యక్తుల వద్ద అప్పులు చేయడంతో, అవి తీర్చే మార్గం కనిపించక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలిపారు. పంటల సాగు అధిక శాతం కౌలు రైతులే చేస్తున్నారన్నారు. అటువంటి కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు జారీ చేయడంలో, ఇచ్చిన కార్డులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నందునే అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద రుణాలు తీసుకొని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. కౌలు రైతులు, రైతుల ఆత్మహత్యలకు పరోక్షంగా బ్యాంక్‌లు, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు. ప్రభుత్వం నుంచి మృతుడి కుటుంబానికి అందాల్చిన రూ.ఏడు లక్షల పరిహారం కుంటి సాకులు చూపకుండా పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మృతుడి పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించి ఉచిత విద్యా బోధనతోపాటు, పీ–4 ద్వారా ఆ కుటుంబాన్ని దత్తత తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గోళ్ల నాగరాజు, ప్రజాసంఘాల నాయకులు తోడేటి సురేష్, బి.సుబ్బారావు, పి.నాగమల్లేశ్వరరావు, పిల్లి మరియారావు పాల్గొన్నారు.