
దమ్ము చక్రాల ట్రాక్టర్లు రోడ్లపైకి వస్తే కేసులు
●బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు హెచ్చరిక
●చెన్నుపల్లిలో ట్రాక్టర్ యజమానులకు అవగాహన సదస్సు
బల్లికురవ: దమ్ము చక్రాల ట్రాక్టర్‌లు రబ్బరు తొడుగులు లేకుండా రహదారుల పైకి వస్తే కేసులు నమోదు చేస్తామని బాపట్ల డీఎస్పీ జి. రామాంజనేయులు హెచ్చరించారు. ఆదివారం చెన్నుపల్లిలో ట్రాక్టర్ యజమానులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంలో డీఎస్పీ మాట్లాడుతూ దమ్ము చక్రాలతో రోడ్లపైకి రావడం వల్ల కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రోడ్లు గాడులు పడుతూ మార్జిన్‌లు దెబ్బతింటూ గోతులు ఏర్పడుతున్నాయని తెలిపారు. దీనివల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పారు. టైర్లతో పొలాల వద్దకు వెళ్లి అక్కడే దమ్ము చక్రాలు అమర్చుకోవాలని, లేకపోతే రబ్బరు తొడుగుతో రోడ్లపైకి రావాలని సూచించారు.ట్రాక్టర్ యజమానులు ప్రభుత్వానికి ట్యాక్స్‌లు సకాలంలో చెల్లిస్తూ ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. మైనర్లను డ్రైవర్లుగా నియమించుకోవద్దని చెప్పారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, నిబంధనలు పాటించని యజమానులపై చర్యలు తప్పవని తెలిపారు. సదస్సులో సంతమాగులూరు సీఐ కె.వెంకటరావు బల్లికురవ, సంతమాగులూరు ఎస్‌ఐలు వై. నాగరాజు, పట్టాభిరామయ్య ఆర్ అండ్ బీ జేఈ బాబ్జి పాల్గొన్నారు.