
నమ్మండి..కాల్వలేనండీ
సాక్షి ప్రతినిధి,బాపట్ల: ఆది నుంచి చంద్రబాబుకు రైతులన్నా.. వ్యవసాయమన్నా గిట్టదు. వ్యవసాయం దండగని కూడా ఆయన వ్యాఖ్యానించడం అందరికీ తెలిసిందే. బాబు తన పాలనలో సాగు నీటి పథకాలను చిన్నచూపు చూశారు. పెండింగ్‌లో ఉన్న నీటి పథకాలకు బడ్జెట్‌లో పైసా నిధులు విదిల్చిన పాపాన పోలేదు. ఆయన ఏనాడూ అన్నదాతల కష్టాలను కనలేదు, వారి బాధలను వినలేదు. చంద్రబాబు మరోమారు ముఖ్యమంత్రి అయినా రైతన్నల కష్టాలను ఏమాత్రం పట్టించుకోలేదు. సాగుకు అవసరమైన ప్రోత్సాహాలను అందించే ప్రయత్నమూ చేయలేదు. అన్నదాత సుఖీభవ ఇంతవరకు ఇవ్వనేలేదు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర సైతం లేదు. ఏడాదిగా అధికారంలోవున్నా... కూటమి పాలకులు జిల్లాలోని కృష్ణా, నాగార్జున సాగర్ ప్రధాన కాలువల పరిధిలోని పంటకాలువల ఆధునికీకరణ పనులను పట్టించుకోలేదు. ఖరీఫ్ ప్రారంభమై ఒకవైపు నీటిని విడుదల చేస్తున్నా జిల్లావ్యాప్తంగా వున్న కాలువల్లోని పూడికతీత పనులను పూర్తిచేయలేదు.
గుర్రపు డెక్క.. తూటికాడ
వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు మండలంలో గంగోలు కాలువలో మూడు కిలోమీటర్ల మేర గుర్రపు డెక్కతోపాటు తూటికాడ మరింతగా పెరిగి పోయింది. నియోజకవర్గంలోని వేమూరు మండలం జంపని డ్రైన్‌తోపాటు అన్నికాలువల్లో ఇదే పరిస్థితి. కాలువలు పూడికతో పనికిరాకుండా పోయాయి. ఆదివారం మండలంలోని చంపాడు వద్ద కాలువలోని తూటికాడలో ఇరుక్కొని పోతుమర్రి గ్రామ రైతుకు చెందిన మూడు గేదెలు మృతి చెందినట్లు తెలుస్తోంది.
● రేపల్లె నియోజకవర్గంలోని రేపల్లె, నగరం, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలాల పరిధిలోని వాడమురుగు డ్రెయిన్, జగజ్జేరు కాలువ, రేపల్లె ఓల్డుకోర్సు, న్యూకోర్సు, ఆర్‌ఎం డ్రెయిన్, బీఎం డ్రెయిన్‌లలో పూడికతోపాటు గుర్రపు డెక్క, తూటికాడ మరింతగా పెరిగి పోయింది. కాలువలకు నీటిని విడుదల చేసినా సక్రమంగా పంటలకు చేరే పరిస్థితి లేదు.
● బాపట్ల నియోజకవర్గంలో తూరుపు శాంప్, నల్లమడ, తుంగభధ్ర, భీమునికుంటవాగు, మరుప్రోలు వారిపాలెం స్ట్రెయిట్‌కట్ తదితర ప్రధాన కాలువలతోపాటు వాటి పరిధిలోని పంటకాలువలు మొత్తం పూడిక, తూటికాడ, గుర్రెపుడెక్క, నాచుతో నిండిపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
● అద్దంకి నియోజకవర్గం పరిధిలో సంతమాగులూరు మొదలుకొని కొరిశపాడు మండలం పమిడిపాడు వరకు సాగర్‌కు సంబంధించి అద్దంకి బ్రాంచ్ కెనాల్ వుంది. పర్చూరు ప్రాంతంలోని పర్చూరు బ్రాంచ్ కెనాల్ పరిధిలోని సాగర్ కాలువల పరిధిలో కొంతమేర కాలువ పూడిక తీత లైనింగ్ పనులు చేసినా మిగిలిన పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితోపాటు కాలువల్లో డ్రాపుల రిపేరు పనులను ప్రభుత్వం పట్టించుకోలేదు. చీరాల నియోజకవర్గ పరిధిలోనూ కాలువల ఆధునికీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చివరి ఆయకట్టులో పూడికతీత పనులనూ ప్రభుత్వం పట్టించుకోలేదు.
పూడికతో నిండిన కృష్ణా, సాగర్ కాలువలు గుర్రపు డెక్క, తూటికాడతో నిండిన వైనం రేపల్లె, వేమూరు, బాపట్ల పరిధిలో మరింత అధ్వానం ఏడాదిగా పట్టించుకోని అధికారులు రైతుల మొర ఆలకించని వైనం ఇప్పుడిప్పుడే కాలువలకు చేరుకుంటున్న నీరు ఈ స్థితిలో కాలువల నుంచి పంటలకు నీరందడం సాధ్యం కాదంటున్న రైతులు
తీవ్ర నిర్లక్ష్యం బారిన పంట కాల్వలు
సాగు నీరందని దుస్థితి
అన్నిప్రాంతాల్లోనూ ప్రధాన కాలువలతోపాటు పంటకాలువల్లో గుర్రపుడెక్క, తూటి కాడ, నాచు మరింతగా పెరిగి కాలువల్లో సాగునీటితోపాటు మురికినీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. కాలువల ఆధునికీకరణ పనులు పూర్తిచేయకపోతే ఖరీఫ్‌లో పంటలకు సాగునీరు సక్రమంగా అందే పరిస్థితి ఉండదని, పనులు పూర్తి చేయాలని రైతులు అటు అధికారులతోపాటు ప్రజా ప్రతినిధులకు విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. కాలువలకు నీటిని విడుదల చేసినందున కనీసం ఏదైనా మందు స్ప్రేచేసి గుర్రపుడెక్క, తూటికాడలను తొలగించి, సాగునీరు సక్రమంగా పారేలా చేయాలని, ఇప్పటికైనా ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

నమ్మండి..కాల్వలేనండీ