
సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
బాపట్ల: సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే బాధితులను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం మంచి పద్ధతి కాదని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 191 అర్జీలను అధికారులు స్వీకరించారు. తన పరిధిలోని వాటికి కలెక్టర్ తక్షణమే పరిష్కార మార్గం చూపారు. కొన్నింటిని ఆయా శాఖల అధికారులకు పురమాయిస్తూ ఆదేశాలు ఇచ్చారు. వారంలో ఒక లక్ష ఫైల్స్ అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. పీ–4 అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. పరిశీలనకు వెళ్లే సమయంలో గ్రామ కమిటీలకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలన్నారు. అర్హులైన బంగారు కుటుంబాలు, మార్గదర్శిలు సరైన వారేనా, నీడ్ బేస్డ్ సర్వే సక్రమంగా జరుగుతుందా లేదా అనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. అనర్హులు ఉన్నట్లు గుర్తిస్తే వారిని తొలగించాలని ఆదేశించారు. పి–4 విధానంలో సవరణ ప్రక్రియకు అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సూర్య ఘర్, స్వచ్ఛతాహి కార్యక్రమాలను పరిశీలించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలన్నారు. రెండు రోజుల ముందుగానే ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపాలన్నారు. ప్రోటోకాల్ అమలు తీరులో సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి