
జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోండి
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయిలో నిర్వహించే ఎన్‌ఎంఎంఎస్ పరీక్షలో భాగంగా 2024 డిసెంబర్‌లో జరిగిన పరీక్షలో ఎంపికై న విద్యార్థులు ఆగస్ట్ 31వ తేదీ లోగా స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు తమ వివరాలను www.schoarships.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసి దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. విద్యార్థి తన వివరాలలో ఏ ఒక్క అక్షరం తేడాగా నమోదు చేసినా స్కాలర్‌షిప్ మంజూరు కాదని స్పష్టం చేశారు. మెరిట్ లిస్ట్‌లో ఉన్న విధంగా ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలని తెలిపారు. నమోదు చేసిన దరఖాస్తును జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందచేయాలన్నారు. ఈఏడాది 10, 11, 12 తరగతులు చదువుతున్న విద్యార్థులు తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. రెన్యువల్ చేయని విద్యార్థులకు స్కాలర్‌షిప్ రాదని తెలిపారు.
అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ
గుంటూరు ఎడ్యుకేషన్: సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గణిత, రసాయనశాస్త్ర అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాదేవి సోమవారం ఓప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు సంబంధించి సబ్జెక్టు పీజీలో 55 శాతం మార్కులు పొంది ఉండాలని, ఎంపిక ప్రక్రియ డెమో ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 24లోపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఈనెల 26న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు.
వైద్య అధికారులతో
డీఎంహెచ్‌ఓ సమావేశం
గుంటూరు మెడికల్: డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి అధ్యక్షతన గుంటూరు జిల్లాలో ఏప్రిల్ 25 – జూన్ 25 వరకు జరిగిన 8 శిశు, చంటి పిల్లల మరణాలపై రివ్యూ కమిటీ సమావేశం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగింది. మరణాలకు కారణాలు, అందించిన వైద్య సేవలు, గృహ సందర్శనలు వివరాలపై చర్చించారు. గుంటూరు నగరంలోని బొంగరాలబీడు, మారుతీనగర్, పొన్నెకల్లు ఆరోగ్యకేంద్రాల పరిధిలో నమోదైన కేసులపై ఆరా తీశారు. సమావేశంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ అమర్తలూరి శ్రావణ్ బాబు, చిన్నపిల్లల వ్యాధుల నిపుణులు డాక్టర్ దేవకుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భవాని, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ సభ్యులు డాక్టర్ ఎస్.రాధామాధవి, డాక్టర్ రోహిణి రత్నశ్రీ , ఈఓఐసీడీఎస్ సుబ్బమ్మ, ఐద్వా ఎన్జీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు.
స్వల్పంగా వరదనీరు విడుదల
తాడేపల్లిరూరల్: ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురియడంతో పలు వాగుల నుంచి వరదనీరు ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరింది. సోమవారం సాయంత్రం స్వల్పంగా వరదనీటిని ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ జేఈ రమేష్ మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజ్ వద్దకు మునేరు ఇతర వాగుల నుంచి 5,300 క్యూసెక్కులు చేరిందని, ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటిమట్టాన్ని 12 అడుగులు మెయింటెన్ చేస్తూ విజయవాడ వైపు ఒక అడుగు మేర 4 గేట్లు ఎత్తి కృష్ణానది దిగువకు 2900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని తెలిపారు. తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు 2522 క్యూసెక్కులు వదిలినట్లు ఆయన తెలిపారు.
కందకంలోకి
దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
తాడికొండ: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కందకంలోకి దూసుకెళ్లిన ఘటన తాడికొండ శివారు పెదపరిమి రోడ్డులో జరిగింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 30 మంది ప్రయాణికులతో గుంటూరు వైపు నుంచి తుళ్ళూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు తాడికొండ దాటిన తరువాత కందకంలోకి దూసుకెళ్లింది. ఇద్దరు మహిళలతోపాటు పలువురు పురుషులకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ దూకుడుగా నడిపాడని, చిన్నగా వెళ్లాలని హెచ్చరించినా పెడచెవిన పెట్టడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు వాపోయారు.

జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తు చేసుకోండి