
హ్యాండ్ ఇచ్చారు!
చీరాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్స్‌కు మంచి రోజులు వస్తాయని నేతన్నలు ఆశించారు. కానీ అధికారం చేపట్టిన ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకాలేదు. పెరిగిన విద్యుత్ చార్జీలతో చేనేత కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉచిత విద్యుత్‌కు జీఓ విడుదల చేసినా.. అది అమలుకు నోచుకోకపోవడంతో తమ జీవితాలు ఇంతే అంటూ నిట్టూరుస్తున్నారు. వ్యవసాయ రంగం తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న చేనేత రంగం రోజురోజుకు కుదేలవుతోంది.
ఉచిత విద్యుత్ హుళక్కే!
జిల్లాలో చేనేత రంగాన్ని నమ్ముకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది జీవనం పొందుతున్నారు. అయితే చేనేతలకు అందిస్తామని చెప్పిన ఏ పథకం వారి దరికి చేరడం లేదు. చేనేతకు ఉచిత విద్యుత్ అందిస్తామని కూటమి పెద్దలు ప్రగల్భాలు పలికారు. మేనిఫెస్టోలో ప్రకటించినప్పటికీ నేటికీ ఆ హామీ అమలు కాలేదు. దీంతో బతుకు భారమైనా జీవిత రాట్నాన్ని నెట్టుకు వస్తున్నారు. జిల్లాలో 33,184 వరకు మగ్గాలు ఉండగా, 24వేల చేనేత కుటుంబాలు వరకు ఉన్నాయి. వీరిలో 50 వేల మంది వరకు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని జీఓలో స్పష్టం చేశారు. అయితే ఇందులో మరో మెలిక పెట్టింది ప్రభుత్వం. డిస్కం సంస్థలు ఇంధన శాఖకు తగిన బడ్జెట్ మంజూరు చేయాలని ప్రతిపాదించారు. అయితే జీఓ విడుదలై నెలలు కావుస్తున్నా బడ్జెట్ విడుదల కాకపోవడంతో నేతన్నలు పెదవి విరుస్తున్నారు. పెరిగిన విద్యుత్ చార్జీల బిల్లులు అందుకుంటూ నేతన్నలు తలలు పట్టుకుంటున్నారు.
నాడు ‘నేస్త’మై నిలిచి..
వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు అర్హులైన ప్రతి నేత కార్మికుడికి నేతన్న నేస్తం కింద సంవత్సరానికి రూ.24 వేలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసింది. అంతేకాకుండా విద్యుత్ చార్జీల నుంచి 96 పైసలు యూజర్ చార్జీలను తగ్గించే వెసులుబాటు కల్పించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు నేతన్నలకు హామీలను గుప్పించగా.. ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు.
హ్యాండ్‌లూమ్‌కు కూటమి రిక్తహస్తం
200 యూనిట్లు ఉచిత విద్యుత్ అమలేది? నేతన్నలకు అందించే రూ.24 వేలు ఊసేలేదు హామీల వర్షం.. అమలు శూన్యం ఆగ్రహంగా ఉన్న చేనేత కుటుంబాలు
ఒక్క హామీ అమలైతే ఒట్టు!
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ మినహాయింపుపై నేటికీ కూటమి సర్కారు ఎలాంటి ప్రకటన చేయలేదు.
చేనేత దినోత్సవం రోజున విజయవాడలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ చేనేతపై జీఎస్టీ ఎత్తివేస్తామని, లేదంటే రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పారు. అతీగతీ లేదు.
చేనేతలు అధికంగా ఉన్న చీరాల ప్రాంతంలో చేనేత పార్కు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చీరాల వచ్చిన సందర్భంగా చెప్పారు. 50 ఎకరాలలో హ్యాండ్‌లూమ్ పార్కు ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. నేటికి ఆ ఊసే లేకుండా పోయింది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలం జాండ్రపేటలో నిర్వహించిన సదస్సుకు ఆ శాఖా మంత్రి సవిత హాజరై కేవలం చేనేతల కోసం అనేక పథకాలు రచించామని చెప్పారే తప్ప అమలుపై ఒక్క మాటా మాట్లాడకపోవడం శోచనీయం.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా సమస్యలల్లో కొట్టుమిట్టాడుతున్న చేనేత పరిశ్రమపై జీఎస్టీ పెనుభారంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేనేత పరిశ్రమపై జీఎస్టీ వేయడంతో మరింత సంక్షోభంలో కూరుకుపోయింది. చేనేత వృత్తులు చేసేవారికి 29 శాతం జీఎస్టీ మినహాయింపు ఇస్తామని చెప్పినా అమలయ్యేలా లేదు.