
ఆశల సాగుకు శ్రీకారం
బాపట్ల : గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు బాపట్లలో వాతావరణం అనుకూలంగా మారడంతో పుడమి తల్లి సేద తీరింది. మట్టిని నమ్ముకొని జీవనం సాగించే కర్షకులను సాగుకు స్వాగతం పలికారు. ఈ ఏడాది సాగు కష్టతరమే అనుకున్న అన్నదాతల ఆశలు ఒక్కసారిగా చిగురించాయి. ఓ వైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉన్నప్పటికీ అన్నదాతలు మాత్రం ససాగు పనుల్లో నిమగ్నం అయ్యారు. గట్లు వేసుకోవడం, వాటిని చదును చేసుకోవడం, ఎరువులు చిమ్మడం, విత్తనాలు చల్లుకునే పనుల్లో మునిగారు. నిన్నటి వరకు బీడు భూములను తలపించేలా ఉన్న పొలాలను సైతం సాగు సిద్ధం చేస్తున్నారు.
అందరి చూపు ఈ రకాల వైపే..
బాపట్ల నియోజకవర్గంలో ఖరీఫ్‌లో సాధారణంగా 24,500 హెక్టార్లు సాగు చేయాల్సి ఉంది. ప్రతి ఏడాది సుమారు మూడు వంతుల మేర బీపీటీ 5204 (సాంబ మసూరి), నెంబర్లు రకాలైన 523, 92, ఎన్‌ఎల్‌ఆర్ 28523 (శ్రీరంగ) సాగు చేపట్టేవారు. ఇసుక నేలల్లోని ఎత్తిపోతల పథకాల కింద సాగు చేసే వారు మాత్రమే ఎన్‌ఎల్‌ఆర్ 145 వైపు మొగ్గు చూపేవారు. గతేడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొన్నారు. అసలు సాగుకే దూరమైన ఆయకట్టు శివారు ప్రాంతాల్లోని రైతులు ఈ సారి రూటు మార్చే పనిలో ఉన్నారు. మున్ముందు వర్షాలు ఉంటాయో... లేవోనన్న భయంతో ఎక్కువకాలం ఉండే రకాలను సాగుచేసేందుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. తక్కువ కాలంలో పంట చేతికి వచ్చే ఎన్‌ఎల్‌ఆర్ 145, బీపీటీ 5204 రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. నీటి సౌకర్యం ఉండి, బోర్లు ద్వారా అయినా సాగు చేయగలమనుకునే రైతులు మాత్రమే ఎక్కువ కాలం పట్టే రకాల వైపు చూస్తున్నారు.
వెద పద్ధతే మేలంటున్న యంత్రాంగం
ప్రస్తుత పరిస్థితుల్లో నార్లు పోసుకొని 25 రోజుల తర్వాత నార్లు పీకి మళ్లీ నాట్లు వేసుకునే కంటే వెద పద్ధతి మేలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. సాగు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఇలా చేస్తే పైరు నీటి ఎద్దడిని తట్టుకోవడంతోపాటు తక్కువ కాలంలోనే పంట చేతికొచ్చే అవకాశం ఉందంటున్నారు. నారు పెంచడం, దమ్ము చేయటం, నాటు వేయించడం వంటివి కలుపుకొని ఎకరాకు సుమారు రూ. 5 వేల నుంచి రూ. 7 వేల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం భూమిలో సరిపడా తేమ శాతం ఉంటుంది కాబట్టి మొక్క త్వరితగతిన బతికే అవకాశం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు కారణమైన మీథేన్, నైట్రస్ ఆకై ్సడ్ వాయువులు ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుందని, తద్వారా వాతావరణంలో కలిగే ప్రతికూల మార్పులను కూడా వెద సాగు తట్టుకుంటుందని వివరించారు.
ఇన్నాళ్లు దాగుడు మూతలాడిన వరుణుడు ఎట్టకేలకు కరుణించాడు. చెరువులు... కాలువలకు జలకళ వచ్చింది. పదునెక్కిన భూములను చూసి సాగు పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు.
వరుస వర్షాలకు పదునెక్కిన భూములు
బాపట్ల నియోజకవర్గంలో
రైతులు హర్షం
సాగు పనులకు సిద్ధమైన అన్నదాతలు

ఆశల సాగుకు శ్రీకారం