
ఎండుతున్న రైతు గుండె!
గురువారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2025
సకాలంలో వర్షాలు పడి కాలువలకు సమృద్ధిగా నీరు వస్తే పంట పొలాలు పైర్లతో కళకళలాడుతుండేవి. ఈ ఏడాది ముందుగానే వర్షాలు పడటం, ప్రస్తుతం వరుణుడు మొహం చాటేయటం, ఈదురు గాలులు వీస్తుండటంతో మొలక దశలో ఉన్న నారు మడులు, వెద పెట్టిన పొలాలు మొక్క దశలోనే మాడిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
బాపట్ల టౌన్: కళ్లెదుటే రైతుల ఆశలు ఆవిరి అవుతుండటంతో ఆవేదన చెందుతున్నారు. డీజిల్ ఇంజిన్లు, నీటిని పెట్టేందుకు అవసరమైన ట్యూబులు అద్దెకు ఇచ్చే షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే దుక్కులు, ఎరువులకు రూ.వేలకు వేలు ఖర్చు చేసి నారుమడులు పోసుకున్న రైతులు మొక్క దశలో ఉన్న పైరును కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. సహజంగా రైతులకు నీటి కష్టాలు అక్టోబర్ మాసంలో పైర్లు బిర్రుపొట్ట దశలో ఉన్నప్పుడు తలెత్తేవి. ఒకటి, రెండు తడులు అందిస్తే ఈని నవంబర్, డిసెంబర్ మాసాల్లో కోతలకు వచ్చేవి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆదిలోనే నీటి కష్టాలు మొదలయ్యాయి. నారు మడుల దశలోనే డీజిల్ ఇంజిన్లపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తీర ప్రాంతాల్లోని రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఇప్పటికే దాదాపు రూ.పది వేలు ఖర్చు
బాపట్ల జిల్లాలో ఏటా రైతులు నార్లు పోసుకొని, నాట్లు వేసుకునే పద్ధతికే మక్కువ చూపేవారు. ఈ ఏడాది జూన్ మాసంలో వర్షాలు కురవడంతో నారు మడులతోపాటు వెద పద్ధతి వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం మొలకలు వచ్చిన పైర్లు కూడా భూమిలో తేమ లేకపోవడం, భానుడి భగభగతో మాడిపోతున్నాయి. నారు మడులు అయితే పూర్తిగా ఎండిపోతున్నాయి. వెద పద్దతిలో సాగు చేసిన పొలాలకు విత్తనాల కొనుగోలు, ట్రాక్టర్ల కూలీ, మందుల పిచికారి, దుక్కులు ఇలా అన్నీ కలిపి ఇప్పటికే ఎకరాకు రూ. 10 వేల వరకు ఖర్చు చేశారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.
న్యూస్‌రీల్
నాలుగు రోజుల్లో కాలువలకు నీరు
ప్రస్తుతానికి మున్సిపాలిటీ చెరువుకు తాగునీటి అవసరాలకు కాలువల నీటిని అందిస్తున్నాం. రెండు రోజులుగా దీనికే సరఫరా చేస్తున్నాం. పీటీ చానల్‌కు నాలుగు రోజుల్లో నీరు విడుదల చేస్తాం. రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం.
– వెంకటరమణ, ఇరిగేషన్ జేఈఈ, బాపట్ల
కాలువ నీరు వస్తే మేలు
మాది చీరాల మండలం, గవినివారిపాలెం. కర్లపాలెం మండలం సమ్మెట వారి పాలెం పంచాయతీ పరిధిలో పొలం ఉంది. ఇటీవల కాలువలకు సాగునీరు రావడంతో నారుమడులు సిద్ధం చేసుకొని నారు పోశా. ప్రస్తుతం నీరు రావడం లేదు. కొద్దిపాటి నీటిని కాలువ మొదట్లో ఉన్న రైతులు డీజిల్ ఇంజిన్లతో వాడుతున్నారు. బోరు ద్వారా నీటిని అందించేందుకు పైపులు తీసుకెళ్తున్నా.
– శ్రీనివాసరావు,
రైతు, గవినివారిపాలెం
పెరిగిన ఖర్చులతో భారం
పీటీ చానల్ పరిధిలో హైదరపేట – సమ్మెట వారి పాలెం మధ్యలో 3 ఎకరాలు ఉంది. మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకున్నా. నాలుగు రోజుల క్రితం నాట్లు వేసేందుకు నారు విత్తనాలు పోశా. ప్రస్తుతం నారు మొలకదశలో ఉంది. వర్షాలు పడటం లేదు. కాలువల్లో నీరు అడుగంటిపోయింది. డీజిల్ ఇంజిన్‌తో తడులు అందిస్తున్నా. మొత్తం తడపాలంటే రూ. 2,500 నుంచి రూ.3,000 వరకు ఖర్చు అవుతోంది.
– పిట్టు గురవారెడ్డి,
శీలంవారిపాలెం
ఆదిలోనే తప్పని క‘న్నీటి’ కష్టాలు
నీరందక ఎండిపోతున్న నారు మడులు
డీజిల్ ఇంజిన్లను ఆశ్రయిస్తున్న
అన్నదాతలు
ఎకరం తడిపేందుకు రూ.వేల ఖర్చు
కాలువల్లో అడుగంటిన సాగునీరు
ఆందోళనలో మునిగిపోయిన రైతులు

ఎండుతున్న రైతు గుండె!

ఎండుతున్న రైతు గుండె!

ఎండుతున్న రైతు గుండె!