
నేరాల నియంత్రణకు డ్రోన్ల నిఘా కీలకం
బాపట్ల టౌన్: నేరాల నియంత్రణకు డ్రోన్లతో నిఘా కీలకమైందని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. జిల్లాలోని ఆరు పోలీస్‌స్టేషన్లకు ఆయా స్టేషన్ల పరిధిలోని దాతలు డ్రోన్లను అందించారు. బుధవారం దాతలను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణలో డ్రోన్ల ద్వారా నిఘా కీలకమన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన 6 డ్రోన్లను దాతలు అందించడం అభినందనీయం అన్నారు. డీజేఐ మినీ–3 డ్రోన్లను జిల్లా పోలీస్ శాఖకు అందించారన్నారు. నిజాంపట్నం పోలీస్‌స్టేషనుకు రాఘవేంద్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తరఫున కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి ఒకటి, నిజాంపట్నంలోని ఏబీఏడీ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ పెర్ల్ మైరెన్ కంపెనీలు సంయుక్తంగా మరో డ్రోన్ అందించాయి. రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్‌కు డి.పి.ఎస్. ఫుడ్స్ తరఫున ఒకటి, భట్టిప్రోలు పోలీసు స్టేషనుకు కొల్లూరు మండలం జువ్వలపాలం చెందిన వేములపల్లి రవికిరణ్ ఒకటి, చెరుకుపల్లి పోలీస్ స్టేషనుకు మండలంలోని ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్‌టైల్స్ ఒకటి, వేమూరు పోలీస్ స్టేషనుకు హైదరాబాద్‌కు చెందిన యోషిత హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక డ్రోన్ బహూకరించినట్లు తెలిపారు. అనంతరం దాతలను సన్మానించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రేపల్లె డీఎస్పీ ఎ. శ్రీనివాస రావు, రేపల్లె టౌన్ సీఐ మల్లికార్జున రావు, రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, వేమూరు సీఐ ఆంజనేయులు, నిజాంపట్నం, భట్టిప్రోలు, వేమూరు, చెరుకుపల్లి ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఆరు డ్రోన్లను అందించిన దాతలు జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ అభినందన