
కోన ప్రభాకరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
బాపట్ల: మాజీ గవర్నరుగా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ స్పీకరుగా, రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి మూడు పర్యాయాలు శాసనసభ్యుడిగా పనిచేసిన దివంగత కోన ప్రభాకరరావు విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే పాత బస్టాండ్ వద్ద డివైడర్‌పై తిరిగి ఏర్పాటు చేయాలని మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి కోరారు. బుధవారం స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోన మాట్లాడుతూ.. రాష్ట్రానికి, దేశానికి కోన ప్రభాకర రావు చేసిన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బాపట్ల పట్టణానికి తాగునీరు అందించిన ఘనత కోన ప్రభాకరరావుకే దక్కుతుందన్నారు. ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చే విధంగా బాధ్యతలు నిర్వహించారన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన సేవలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రహదారి విస్తరణలో పాత బస్టాండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తొలగించి తిరిగి ఏర్పాటు చేస్తామని ఆ రోజు తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఆ తీర్మానం అమలుకు నోచుకోలేదని, ఆయన జయంతి సందర్భంగానైనా పురపాలక సంఘం అధికారులు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలన్నారు. సుప్రీంకోర్టు సైతం డివైడర్లపై విగ్రహాలు పెట్టుకోవచ్చనే సూచన చేసిందన్నారు. మరి ఎందుకు జాప్యం జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. రహదారి విస్తరణలో తొలగించిన విగ్రహాలను తిరిగి ఏర్పాటు చేయాలని అడుగుతున్నామని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు, గుర్రం జాషువా విగ్రహాలను తొలగించి మూలన పెట్టేశారన్నారు. వాటిని కూడా తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. గురువారం జరిగే కోన ప్రభాకరరావు జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు కాగిత సుధీర్ బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, జోగి రాజా, శ్రీనివాసరెడ్డి, తన్నీరు అంకమ్మరావు తదితరులు ఉన్నారు.