
శాంతియుత వాతావరణం కోసమే పల్లె నిద్ర
డీఎస్పీ శ్రీనివాసరావు
రేపల్లె: శాంతియుత వాతావరణం నెలకొల్పి ప్రజలతో మమేకం అయ్యేందుకు పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు చెప్పారు. పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి పట్టణంలోని 16వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వార్డులో సమస్యలు తలెత్తితే శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. వివాదాస్పదమైన అంశాలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అనుమానాస్పద స్థితిలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు తెలపాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు, పోక్సో కేసుల వివరాలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, బాల్య వివాహాల నివారణ తదితర చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పట్టణ సీఐ మల్లికార్జునరావు, ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.