
జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
రేపల్లె: జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ డిమాండ్ చేశారు. పట్టణంలోని 18వవార్డు సమీపంలోని జగనన్న కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో కాలనీవాసులు సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో చినుకు పడితే అక్కడ నడిచే పరిస్థితులు లేదన్నారు. దోమల బెడద అధికంగా ఉంటోందన్నారు. వర్షపు నీరు పోయే మార్గం లేదన్నారు. తాగునీరు రాకపోవటంతో దూరప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. పారిశుద్ధ్య లోపం ఉందని చెప్పారు. కొన్ని నెలల నుంచి ఈ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు ప్రజాప్రతినిధులను, అధికారులను కోరినా ఫలితం లేదన్నారు. ఇక స్పందించకుంటే కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు చేసేందుకు సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వి.ధనమ్మ, సభ్యులు కె.రవికుమార్, శ్రీనివాసరావు, వీరాంజనేయులు, ఫర్జానా, కనకదుర్గ, సీపీఎం నాయకులు ఆశీర్వాదం, అగస్టీన్, రమేష్, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.