
తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ ఆందోళన
బాపట్ల: మత్స్యకార ఉద్యమాలపై తప్పుడు ప్రచారాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీలు, మత్స్య కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. 15 రోజులుగా మత్స్యకారులు తమ వృత్తికి అనుగుణంగా సహజసిద్ధంగా ఉన్న సముద్రం ముఖద్వారాన్ని పునరుద్ధరించాలని ఆందోళన చేస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించి కలెక్టర్‌ను కలిశారు. స్పందించిన కలెక్టర్ విచారణ కమిటీని నియమించారు. న్యూస్ చానల్స్, పత్రికా ప్రతినిధులు ఆక్రమణదారులకు అనుకూలంగా మత్స్యకార ఉద్యమానికి రాజకీయ రంగు పులుముతూ సమస్యను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అండగా ఉండి ఉద్యమాన్ని నడుపుతుందనే ప్రచారాన్ని మత్స్యకారులు ఖండించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బాబురావు మాట్లాడుతూ మత్స్యకార ఉద్యమం ప్రజా సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు. సమస్యను పక్కదారి పట్టించడం కోసం కొన్ని చానల్స్ కొంతమంది పాత్రికేయులు తప్పుడు ప్రచారం చేస్తున్నారనన్నారు. కార్యక్రమంలో వాడరేవు సర్పంచ్ ఎరిపల్లి రమణ, మత్స్యకార జేఏసీ నాయకులు సైకం రాజశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, సీపీఐ (ఎంఎల్ న్యూ డెమోక్రసీ) నాయకులు మేకల ప్రసాద్, మత్స్యకార సంఘాల నాయకులు పిక్కి శామ్యూల్ పాల్గొన్నారు.