
ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
రేపల్లె: తమ సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం రేపల్లె మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు కళ్లకు నల్లరిబ్బన్‌లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. యూనియన్ అధ్యక్షుడు డి.ప్రభాకరరావు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం జీవో 36 ప్రకారం రూ.24,500 వేతనం అందించాలని, పీఆర్‌పీ అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. గతంలో సమస్యల సాధనకై నిర్వహించిన 17 రోజుల సమ్మె కాలానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు జీవోలు విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్, యూనియన్ నాయకులు రవి, రాఘవేంద్రరావు, శివ, యువరాజు, తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా కావడి సేవ
బాపట్ల: అత్యంత వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కావడి సేవా మహోత్సవం సోమవారం చేపట్టారు. బాపట్ల కోన కళాక్షేత్రంలో శ్రీ లలితా త్రిపుర సుందరీ పీఠం ఆధ్వర్యంలో ఉదయం కావడి సేవా మహోత్సవం, అభిషేకం, పుష్పయాగం, సర్పసూక్త హోమం నిర్వహించారు. నెమలికంటి హనుమంతరావు సారథ్యంలో ముత్తేవి శ్రీనివాస శశికాంత్ ఆధ్వర్యంలో ఉత్సవం చేపట్టారు. మేడూరి వెంకట అప్పలాచార్యులు, రొంపిచర్ల కేశవాచార్యులు, రొంపిచర్ల గోపాలచార్యులు, కొల్లిపర వెంకట శివ వర ప్రసాద్, శ్రీనివాసుల విఖనస మూర్తి, గూడా సాయి వెంకట్, భీమవరపు సురేష్ శర్మ సహకారంతో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేకం చేపట్టారు.

ఇంజినీరింగ్ కార్మికుల నిరసన