
అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి
బాపట్ల టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి 49 మంది అర్జీదారులు వచ్చారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న అనంతరం ఎస్పీ వారికి భరోసా కల్పించారు. జిల్లాలోని పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. చట్ట పరిధిలో విచారించి గడువులోగా పరిష్కరించాలన్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు వంటి సమస్యలే అధికంగా వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, పి.జి.ఆర్.ఎస్. ఇన్‌చార్జి సీఐ శ్రీనివాసరావు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై 10 అర్జీలు
రేపల్లె: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 10 అర్జీలు అందినట్లు ఆర్డీవో నేలపు రామలక్ష్మి చెప్పారు. స్థానిక కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె ప్రజల నుంచి అర్జీలు స్వీకరించాక మాట్లాడారు. పట్టణంలోని 22, 23 వార్డులలో పందులు సంచరించడంతో సమస్యగా ఉందని ప్రజలు కోరారని పేర్కొన్నారు. ఓల్డ్‌టౌన్ అంకమ్మ చెట్టు సెంటరులో ట్రాఫిక్ సమస్యపై పట్టణాభివృద్ధి సంఘం కార్యదర్శి సీవీ మోహనరావు అర్జీ అందించారన్నారు. నేషనల్ హైవే నిర్మాణంతో స్థలం కోల్పోయిన తనకు నష్టపరిహారం అందించాలని పెనుమూడి గ్రామానికి చెందిన కృష్ణ కోరారని చెప్పారు. జగనన్న కాలనీలోని చర్చితో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజలు అర్జీ ఇచ్చారన్నారు. ప్రజ్ఞం గ్రామంలో సాగునీరు అందించకుండా పలువురు అడ్డుపడుతున్నారని వెంకటేశ్వరరావు అర్జీ చేశారని చెప్పారు. భట్టిప్రోలు మండలం పెదలంకలో ఉన్న జగనన్న కాలనీలోని స్థలాల ఆక్రమణలను తొలగించాలని పెదలంక గ్రామానికి చెందిన నన్నెపాముల నాగేశ్వరరావు అర్జీ ఇచ్చారని వివరించారు. సిరిపూడిలోని తన పొలం హద్దులు చూపించాలని గొర్రెమూర్తి చిన్నారావు అర్జీ అందించాడన్నారు. జువ్వలపాలెంలో డ్రైనేజీ సమస్యపై ఆలూరి రామ్మోహనరావు అర్జీ అందించారన్నారు. కొల్లూరు పరిసర ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా అరికట్టాలని జి.ప్రసాద్ ఫిర్యాదు చేశాడన్నారు. చోడాయపాలెంలోని తన భూమిని ఆన్‌లైన్ చేయాలని రేపల్లెకు చెందిన గాదె వెంకట నరసమ్మ అర్జీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. పరిశీలించి ఆయా శాఖల అధికారుల ద్వారా పరిష్కరిస్తామని ఆర్డీవో తెలిపారు.
ఎస్పీ తుషార్‌డూడీ

అర్జీదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి