
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృత్యువాత
మరో మహిళకు తీవ్ర గాయాలు
మాచవరం: ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని పిల్లుట్లలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లుట్ల గ్రామానికి చెందిన కాండ్రకుంట ఐశ్వర్య (33), కామినేటి సుజాతలతో పాటు మరి కొంత మహిళలు పొలం పనుల నిమిత్తం రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలో నర్రా బాలు పిడుగురాళ్ల వైపు నుంచి ద్విచక్ర వాహనంపై అతి వేగంగా వస్తూ వారిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలిస్తుండగా కాండ్రకుంట ఐశ్వర్య (33) మృతి చెందింది. తీవ్ర గాయాలైన సుజాతను పిడుగురాళ్ల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ ఎం.రోశయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతు
పోలీసుల ముమ్మర గాలింపు
అచ్చంపేట: కృష్ణా నదిలో వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలోని గింజుపల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పల్నాడు జిల్లా, నకరికల్లు మండలం, చాగళ్లు గ్రామానికి చెందిన ఆలపరి సైదారావు(43) మరికొంత మందితో ఆదివారం ఉదయం ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసుకుని మాదిపాడు పంచాయతీ పరిధిలోని సత్తెమ్మ తల్లి దేవాలయానికి వచ్చారు. మధ్యాహ్నం వరకు అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుని, కానుకలు సమర్పించి అక్కడే భోజనాలు వండుకుని తిన్నారు. సుమారు మూడు గంటల సమయంలో సమీపంలోని గింజపల్లి వద్ద కృష్ణానదిలో సరదాగా ఈత కొట్టేందుకు మరో 10మందితో దిగాడు. సైదారావు నది లోతుల్లోకి వెళ్లిపోగా దగ్గరలో ఉన్నవారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలించ లేదు. విషయం తెలుసుకున్న అచ్చంపేట సీఐ శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈతగాళ్ల సహాయంతో చేపల పడవల ద్వారా ఆదివారం రాత్రి 7గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. మృతుడు కూలి పనే వృత్తిగా జీవిస్తుంటాడు. సైదారావుకు భార్య, బీటెక్ చదివే కుమారైలు ఇద్దరు ఉన్నారు.
సంపులో పడి బాలుడు మృతి
లక్ష్మీపురం: సంపులో పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం జరిగింది. గుంటూరు కొత్తకాలనీకి చెందిన ఒడిశా వాసుల కుమారుడు రాఘవకుమార్ (5) ఆడుకుంటూ ఓ సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. నీటి కోసం తవ్విన సంపుకు ఎటువంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో బాలుడు ప్రమాదవశాత్తు అందులో జారి పడ్డాడు. అయితే కుటుంబ సభ్యులుకు బాలుడు కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాలలో గాలింపు ప్రారంభించారు. తీరా సంపులో పరిశీలించగా బాలుడు రాఘవకుమార్ సంపులో పడి ఉన్నాడు. దీంతో హుటాహుటిన బాలుడిని ప్రభుత్వ సమగ్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయం తెలుసుకున్న నగరంపాలెం పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం తరలించగా బాలుడి కుటుంబ సభ్యులు ఎలాంటి ఫిర్యాదులు చేయబోమని, ఎలాంటి పోస్ట్‌మార్టం అవసరం లేదని చెప్పి బాలుడి మృత దేహాన్ని తీసుకువెళ్లారు.

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృత్యువాత

ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృత్యువాత