
కళల తెనాలికి ఆభరణం కాటూరి శిల్పకళ
తెనాలి: వంశ పారంపర్యంగా వస్తున్న శిల్పకళను కొనసాగిస్తూ అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొస్తున్న శిల్పకళాకారులు కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిచంద్ర, శ్రీహర్షలు తెనాలికి గర్వకారణమని పలువురు వక్తలు అభినందించారు. ప్రముఖ స్వచ్ఛంద సేవాసంస్థ మానవత తెనాలి శాఖ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక ఏఎస్‌ఎన్ డిగ్రీ కాలేజి లైబ్రరీ హాలులో జరిగింది. సంస్థ తెనాలి చైర్మన్ డాక్టర్ కొలసాని రామ్‌చంద్ అధ్యక్షత వహించారు. రాష్ట్రప్రభుత్వ ‘కళారత్న’ అవార్డు గ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్షను ఈ వేదికపై సత్కరించారు. తెనాలిలో తొలిసారిగా శిల్పకళపై నిర్వహిస్తున్న కాటూరి ఆర్ట్ గ్యాలరీ, తండ్రీకొడుకుల శిల్పకళానైపుణ్యానికి నిదర్శనమని డాక్టర్ రామ్‌చంద్ అన్నారు. శిల్పకళలో తెనాలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన శిల్పకారులను సత్కరించిన మానవత విధిగా భావించినట్టు తెలిపారు. సత్కారగ్రహీత కాటూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తండ్రీకొడుకులు ముగ్గురికీ ఒకే వేదికపై అభినందన గౌరవం మరచిపోలేనిదని చెప్పారు. తండ్రి కోటేశ్వరరావు నుండి వచ్చిన శిల్పకళను గురువు అంచే రాధాకృష్ణమూర్తి శిక్షణలో మెరుగుపరచుకున్నట్టు సోదాహరణంగా చెప్పారు. బీఎఫ్‌ఏలో పీజీ చేసిన రవిచంద్ర ఇనుప వ్యర్థాలకు శిల్పకళా సోయగాలు కల్పిస్తుంటే, శ్రీహర్ష త్రీడీ, ఏఐ టెక్నాలజీని జోడిస్తూ కళాత్మక ఉట్టిపడేలా చేస్తుండటం తమ అదృష్టమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్ మున్సిపల్ హైస్కూలు విద్యార్థులు, ఉపాధ్యాయుడు బెల్లంకొండ వెంకట్ నేతృత్వంలో ప్రదర్శించిన ‘తల్లికి వందనం’ కార్యక్రమం ఆకట్టుకుంది. ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడు ఓంకార్ ప్రసాద్, కార్యదర్శి పి.వెంకట్, డీవీ సోమయ్యశాస్త్రి, కూరపాటి కల్యాణి, మొవ్వా సత్యనారాయణ, ముత్తేవి రవీంద్రనాధ్, అయినాల మల్లేశ్వరరావు, వెంపటి సత్యనారాయణ పాల్గొన్నారు.
సత్కార సభలో ప్రముఖుల అభినందన