పిడుగు పడి కొబ్బరి చెట్టు దగ్ధం
యద్దనపూడి: మండలంలో బుధవారం సాయత్రం ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. కొద్దిపాటి వర్షం కూడా పడింది. మండలంలోని పోలూరు గ్రామంలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడి మంటలు చెలరేగాయి. చెట్టుపక్కన ఉన్న వరిగడ్డి వామి కూడా కొద్ది మేర కాలిపోయింది. గ్రామం నడిబొడ్డున ఉన్న చెట్టుపై పిడుగుపడినా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. స్థానికులు ఆ శబ్దానికి భయపడిపోయారు. మంటలు చెలరేగకుండా ఆర్పివేశారు.
పిడుగుపాటుకు మహిళ మృతి
యడ్లపాడు: పిడుగు పాటుకు మహిళ బుధవారం మృతి చెందింది. మండలంలోని కారుచోల గ్రామానికి చెందిన 15 మంది మహిళలు మిర్చికోతకు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులు రావడంతో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలో సమీపాన పిడుగు పడిన భారీ శబ్దం విని వారిలో ముగ్గురు మహిళలు కింద పడిపోయారు. వారిలో షేక్ పర్వీన్(35) చెవుల నుంచి రక్తం కారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు. మృతురాలి భర్త షేక్ సైదావలి దివ్యాంగుడు. తాపీ పనులు చేస్తుండగా, వారికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.


