ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్మోహనరావు
బాపట్ల టౌన్: ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నం రామ్మోహనరావు తెలిపారు. ఎన్‌ఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఆర్టీసీ కార్యాలయం ముందు అద్దంకి, చీరాల, బాపట్ల, రేపల్లె డిపోల పరిధిలోని నాయకుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. రామ్మోహనరావు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత ఆదేశాలను వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అమలు పరచాలన్నారు. అక్రమ సస్పెన్షన్ల రద్దు చేసి, తిరిగి ఉద్యోగం ఇవ్వాలన్నారు. నాలుగు సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్లను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెచ్‌ఎస్ స్థానంలో ఆర్టీసీకి పాత వైద్య విధానాన్ని అమలు పరచాలన్నారు. మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు ఇవ్వాలని, గ్యారేజీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ, ప్రభుత్వమే కొని ఉద్యోగులతో నడిచేలా చూడాలని పేర్కొన్నారు. నైట్ అవుట్ అలవెన్సులు రూ.150 నుంచి రూ.450కు పెంచాలన్నారు. సిక్ లీవులకు పూర్తి జీతం చెల్లించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వైఎస్ ప్రసాద్, జిల్లా కార్యదర్శి తులసి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యులు పెంచలయ్య, గాంధీ ఆశాబాబు, జిల్లాలోని నాలుగు డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.


