
నాటకాలను బతికించుకుందాం
మార్టూరు: సామాజిక రుగ్మతల పరిష్కారాలకు దివ్య ఔషధం నాటకమని సమష్టి కృషితో వాటిని బతికించుకోవాల్సిన అవసరం ఉందని 3150 రోటరీ జిల్లా గవర్నర్ కె.శరత్ చౌదరి పిలుపునిచ్చారు. మార్టూరు మద్ది సత్యనారాయణ కంపెనీ ఆవరణలో గురువారం రాత్రి రోటరీ శ్రీకారం కళాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. 15 సంవత్సరాలుగా మార్టూరులో పరిషత్ పోటీలు నిర్వహించటం అభినందించదగ్గ విషయమని అందులో మార్టూరు రోటరీ క్లబ్ భాగస్వామ్యం కావటం తనకు గర్వంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎఫర్ట్ సంస్థ డైరెక్టర్ జేవీ మోహనరావు, శ్రీకారం స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి జాష్టి అనూరాధ, మార్టూరు రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మద్దుమాల కోటేశ్వరరావు, మాదాల సాంబశివరావు ఇతర రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆలోచింపజేసిన ‘కపి రాజు’
శ్రీకారం రోటరీ కళాపరిషత్ రాష్ట్రస్థాయి నాటికల పోటీలలో భాగంగా మొదటి ప్రదర్శనగా న్యూ స్టార్ మోడరన్ థియేటర్ విజయవాడ వారి ‘కపి రాజు‘ నాటికను ప్రదర్శించారు. డబ్బు వలన ఆత్మీయుల మధ్య పెరుగుతున్న అంతరాల గురించి నటులు హృద్యంగా చూపించారు. ఎం.ఎస్. చౌదరి రచించి దర్శకత్వం వహించిన ఈ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది.
నిజాయితీ విలువను చాటిన ‘గురితప్పిన వేట’
రెండవ ప్రదర్శనగా రసఝ రి ఆర్ట్స్ పొన్నూరు వారి ‘గురితప్పిన వేట’నాటికను ప్రదర్శించారు. డబ్బు ఎలా సంపాదించారని కాకుండా ఎంత సంపాదించారని మాత్రమే చూసే నేటి సమాజంలో డబ్బు సంపాదనకు అక్రమార్గాలే దగ్గరి దారని భావించే వారికి నిజాయితీ విలువను చాటి చెబుతూ కనువిప్పు కలిగించే ప్రయత్నం చేశారు నటీనటులు. పిన్నమనేని మృత్యుంజయరావు రచించిన ఈ నాటికకు దర్శకుడైన వై.ఎస్. క్రిష్నేశ్వరరావు తాత పాత్రధారిగా నటించి తన పాత్రకు న్యాయం చేశారు.
న్యాయవాదుల తీరును ప్రశ్నించిన
‘27వ మైలురాయి’
న్యాయ న్యాయవాదుల లోపాలపై సంధించిన నాటిక యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్ విజయవాడ వారి ‘27 వ మైలురాయి’. కొంతమంది న్యాయవాదులు న్యాయాన్ని బతికించటం కోసం కాకుండా తమ ఆదాయాల కోసం మాత్రమే ప్రాధాన్యతనిస్తూ తప్పుడు కేసులు వాదిస్తున్న లాయర్ల తీరును ఈ నాటికలోని పాత్రధారులు సూటిగా ప్రశ్నిస్తారు. గతంలో తాను వాదించిన ఓ తప్పుడు కేసులో తన ద్వారా శిక్ష పడిన ఓ కుటుంబం ఎంతటి క్షోభ అనుభవించింది దాని తాలూకు ఫలితాలను ఆ న్యాయవాది కుటుంబం ఎలా ఎదుర్కోవాల్సి వచ్చింది అనే విషయాన్ని నటీనటులు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. పి. టి.మాధవ్ రచించిన ఈ నాటికకు ఆర్ వాసు దర్శకుడు. నాలుగవ ప్రదర్శనగా స్థానిక శ్రీకారం రోటరీ కళాపరిషత్తు వారు ‘50 కోట్లు... ఆ తరువాత‘ అనే ఎగ్జిబిషన్ ప్లేను ప్రదర్శించారు. జె వి.మోహనరావు రచించిన ఈ నాటికకు ఎస్.జయరావు దర్శకత్వం వహించారు.
గ్రామీణ ప్రాంతంలో పరిషత్తు నిర్వహణ సాహసమే 3150 రోటరీ జిల్లా గవర్నర్ కె.శరత్ చౌదరి
నేటి ప్రదర్శనలు
కళాపరిషత్తులో భాగంగా రెండో రోజైన శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మొదటి నాటికగా శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి జనరల్ బోగీలు నాటికను ప్రదర్శించనున్నారు. ఎనిమిదిన్నర గంటలకు శ్రీ చైతన్య కళా స్రవంతి విశాఖ వారి(అ)సత్యం నాటిక, 9:30 గంటలకు కళానికేతన్ వీరన్నపాలెం వారి ఋతువు లేని కాలం నాటిక ప్రదర్శించన్నారు.

నాటకాలను బతికించుకుందాం