
తిరునాళ్లలో ‘మైక్ అనుమతి’ నిరాకరణ
చెరుకుపల్లి: పొన్నపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ కార్మూరమ్మ వారి తిరునాళ్లకు మైక్ అనుమతి ఇవ్వకుండా స్థానిక పోలీసులు అడ్డుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మండలంలోని పొన్నపల్లి గ్రామంలో ఎక్కువ శాతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. 95 శాతం మంది వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులు ఉన్నారు. పది రోజులు క్రితం మైక్ అనుమతి కోసం గ్రామ పెద్దలు మీ–సేవ ద్వారా చలానా తీశారు. స్థానిక ఎస్‌ఐ అనిల్‌కుమార్‌ను నాలుగు రోజులుగా పొన్నపల్లి గ్రామస్తులు సంప్రదిస్తూనే ఉన్నారు. గ్రామంలో గొడవలు జరుగుతాయనే సమాచారం ఉందని, అందుకే మైక్ పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం గమనార్హం. దీంతో ఆదివారం వైఎస్సార్‌సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రేపల్లె రూరల్ సీఐ సురేష్‌బాబును, ఎస్‌ఐ అనిల్ కుమార్‌ను దీనిపై సంప్రదించినా అనుమతికి ససేమిరా అన్నారు. వైఎస్సార్‌సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, డాక్టర్ ఈవూరి గణేష్ తదితరులు గ్రామస్తులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ ఈవూరి గణేష్ మాట్లాడుతూ.. గ్రామంలోని వారు వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉన్నారని, కూటమి నేతల ఆదేశాల మేరకే స్థానిక పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారని తెలిపారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి తిరునాళ్ల సంతోషంగా జరుపుకోవటానికి మైక్ అనుమతి ఇవ్వాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రేపల్లె డీఎస్పీ అవల శ్రీనివాసరావు వచ్చి డాక్టర్ ఈవూరి గణేష్‌తో చర్చించారు. దీంతో మైక్ పర్మిషన్ వచ్చింది. దీనిపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వరుకూటి అశోక్ బాబు, డాక్టర్ ఈవూరి గణేష్‌లు అమ్మవారిని కార్యకర్తలతో కలిసి దర్శించుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ దుండి వెంకటరామిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
వెఎస్సార్‌సీపీకి గ్రామస్తులు అనుకూలమని పక్షపాతం
రేపల్లె రూరల్ పోలీసుల అత్యుత్సాహం
నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరి గణేష్ ఆగ్రహం
నిరసన తెలిపిన తర్వాత ఎట్టకేలకు డీఎస్పీ ఆదేశాలతో మైక్ అనుమతి