సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
బాపట్లటౌన్: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ తుషార్ డూడీ హెచ్చరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీని కలసి తమ సమస్యలు ఏకరవు పెట్టారు. బాధితుల సమస్యలు తెలుసుకుని, వారి నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ జిల్లాలోని పోలీస్ అధికారులతో మాట్లాడుతూ దివ్యాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులు అత్యంత ప్రాధాన్యతతో చట్ట పరిధిలో విచారించి పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోలీస్‌స్టేషన్లకు, కార్యాలయాలకు వచ్చినప్పుడు వారి పట్ల పోలీస్ అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. వారి ఫిర్యాదులకు ముఖ్య ప్రాధాన్యతనిచ్చి, చట్ట పరిధిలో విచారించి బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపాలన్నారు. అర్జీలను పరిష్కరించడంలో జాప్యత వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా సంబంధిత అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ టి.పి.విఠలేశ్వర్, సీసీఎస్ డీఎస్పీ జగదీష్ నాయక్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ తుషార్ డూడీ పీజీఆర్‌ఎస్‌లో 71 అర్జీలు స్వీకరణ


