● స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద నిధులు
● కేంద్రం ఆమోదం తెలిపిందన్న పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలోగల సూర్యలంక బీచ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ స్వదేశీ స్కీమ్ 2.0 కింద రూ.97.52 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే సూర్యలంక బీచ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సరికొత్త హంగులతో పర్యాటకులను ఆకట్టుకోనుందని తెలిపారు. సూర్యలంక బీచ్‌లో పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కల్పించేందుకు రూ.15.43 కోట్లు, షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధికి రూ.4.37 కోట్లు, స్థిరమైన పర్యాటక అభివృద్ధి, పార్కింగ్ సౌకర్యానికి రూ.7.76 కోట్లు కేటాయించనున్నామని అన్నారు. కెనాల్ ఎక్స్‌పీరియన్స్ డెవలప్‌మెంట్‌కు రూ.11.69 కోట్లు, సూర్యలంక ఎక్స్‌పీరియన్స్ జోన్ కింద రూ.19.36 కోట్లు, ఇతర మౌలిక వసతుల కల్పన నిమిత్తం రూ.18 కోట్లు ఖర్చు చేయనున్నామని వివరించారు. అనంతరం ఇక్కడ కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం కృషి చేస్తామని తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్ధి, పర్యాటకుల స్వర్గథామంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలతోకూడిన ప్రతిపాదనలను ఇప్పటికే కేంద్రానికి పంపించామని అన్నారు. స్పందించిన కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిధుల విడుదలకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. కేద్ర ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి రూ.269.86 కోట్లు నిధులు విడదలయ్యాయని అన్నారు. అందులో భాగంగా ఇప్పటికే శాస్కి స్కీమ్ కింద అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్ట్‌లకు రూ.172.34 కోట్లు మంజూరుకాగా సంబంధిత పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. తాజాగా సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్ల విడుదలకు ఆమోదం లభించిందన్నారు.