ఒక్కొక్కరికి ఏడాది జైలు, రూ.10 వేలు జరిమానా
అద్దంకి: లారీ డ్రైవర్‌ను ఆర్టీవోనంటూ బెదిరించి ఇరవై ఐదు వేలు డబ్బులు కాజేసిన కేసులో నిందితులు ఇద్దరికి సంవత్సరంపాటు జైలు శిక్షను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కే సీత విఽధించినట్లు సీఐ సుబ్బరాజు మంగళవారం తెలిపారు. 2015 జనవరి నెల 18వ తేదీన చక్రాయపాలెం వద్ద నామ్ రహదారిలో జరిగిన ఘటన వివరాలు.. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణానికి చెందిన గోవిందస్వామి సురేష్ మార్బుల్ లోడుతో మధ్యప్రదేశ్ నుంచి చైన్నె బయలుదేరాడు. మార్గంమధ్యలో అద్దంకిలోని చక్రాయపాలెం వద్దకు రాగానే తన లారీని నిందితులైన అజిత్‌కుమార్ సింగ్, అజయ్‌సింగ్‌లు మేము ఆర్టీఓలమని చెప్పి క్లీనర్‌ని కొట్టి అతని వద్దనున్న రూ.25 వేలు తీసుకొని వెళ్లారు. ఈ విషయమై అప్పట్లో అద్దంకి ఎస్‌ఐగా పనిచేసిన సీహెచ్ వెంకటేశ్వర్లుకి బాధితుడు గోవిందస్వామి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఎస్సై వెంకటేశ్వర్లు అప్పటి సీఐ బేతపూడి ప్రసాద్ నిందితులను అరెస్టు చేసి చార్జిషీట్ వేశారు. కేసు విచారణలో భాగంగా నిందితులైన అజిత్‌కుమార్ సింగ్, అజయ్ సింగ్‌లపై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి సంవత్సరంపాటు జైలు శిక్ష, రూ.పది వేల జరిమానా జడ్జి విధించినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. సీఐ సుబ్బరాజు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ బీవీ రమణ నిందితులను కోర్టులో హాజరు పరచారు.
గణనీయంగా పెరిగిన మల్లేశ్వరుడి ఆదాయం
109 రోజుల హుండీ కానుకల ఆదాయం రూ.58.03లక్షలు
పెదకాకాని: శివాలయం మల్లేశ్వరస్వామి ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపారు. పెదకాకాని భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో మంగళవారం హుండీల్లోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా కాజ గ్రూపు టెంపుల్స్ ఈఓ పుణ్యాల వెంకటరెడ్డి హాజరయ్యారు. 109 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ.58,03,497లు ఆదాయం లభించినట్లు తెలిపారు. అలాగే అన్నప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.2,89,270లు సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం 54.300 గ్రాములు, వెండి 438 గ్రాములు, ఆస్ట్రేలియా 20 డాలర్లు, యుఎస్‌ఏ 139 డాలర్లు, ఇంగ్లాండ్ 10 పాండ్లు, నేపాల్ కరెన్సీ రూ.130 , ఇండోనేషియా రూ.5000 వచ్చాయని డీసీ తెలిపారు.
సుబ్రహ్మణ్యేశ్వరునికి విశేష పూజలు
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో మంగళవారం సుబ్రహ్మణ్యస్వామికి విశేషపూజలు నిర్వహించారు. స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకుడు శంకరమంచి రాజేష్ శర్మ మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అమరేశ్వరుని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పలుగ్రామాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన వాయిదా
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మార్చి 27 నుంచి 29వ తేదీవరకు మూడు రోజులపాటు నిర్వహించనున్న ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శనను కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేయటం జరిగిందని విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ ఆర్.శారదజయలక్ష్మిదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని తెలిపారు.
నకిలీ అధికారులకు జైలు