పర్చూరు(చినగంజాం): నమ్మిన నాయకులను, కార్యకర్తలను ఆపదలో ఆదుకుంటానని నిరూపించారు పర్చూరు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె మధుసూదనరెడ్డి. తన తండ్రి గాదె వెంకటరెడ్డి బాటలో నడుస్తూ పార్టీ శ్రేణులంటే ఎంతో అభిమానం చూపుతున్నారు. ఇందుకు ఫారం 7 దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేసిన సమస్యను పరిష్కరించిన తీరు నిదర్శనంగా నిలిచింది. పర్చూరు నియోజకవర్గంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు అందించిన ఫారం 7 ఫిర్యాదులకు సంబంధించి ఎన్నికల కమిషన్ విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ ఫారం 7 విషయం తెరపైకి తీసుకొచ్చారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై ఆయనే స్వయంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సిట్ విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, విచారణ బృందాన్ని ఏర్పాటు చేయించారు.
ఉపసంహరించుకున్న ప్రభుత్వం..
ఈ విషయాన్ని గాదె మధుసూదనరెడ్డి దృష్టికి ఫారం 7 అర్జీదారులు, నాయకులు, కార్యకర్తలు తీసుకొచ్చారు. హైకోర్టు లాయర్లతో ఆయన చర్చించి మార్చి 12వతేదీ కేసు ఫైల్ చేయించారు. అదే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హోం సెక్రటరీ, ఎమ్మెల్యే, చీఫ్ సెక్రటరీలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 18వ తేదీన విచారణ చేపట్టిన కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం వాయిదా కోరడంతో వాయిదా వేసింది. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేశారు. ఈ విషయమై నియోజకవర్గంలో ఫారం 7 అర్జీదారులు, నాయకులు, కార్యకర్తలు మధుసూదనరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఫారం 7 విషయంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై సిట్ విచారణకు ఎమ్మెల్యే ఫిర్యాదు కోర్టుకు వెళ్లి ధైర్యం నింపిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గాదె కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో గాదెకు పార్టీ నేతలు, కార్యకర్తలు కృతజ్ఞతలు